ఆర్డీఎస్‌కు టీడీపీ, కాంగ్రెస్‌లే అడ్డంకి

ఆర్డీఎస్‌కు టీడీపీ, కాంగ్రెస్‌లే అడ్డంకి - Sakshi


- రూ.766 కోట్లతో తుమ్మిళ్లకు ప్రతిపాదనలు

- నెట్టెంపాడు ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు

- భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

 

 సాక్షి, గద్వాల: రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆర్డీఎస్ ఆధునికీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు వివరించారు. ఆర్డీఎస్‌ను ఏపీలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ నాయకులే అడ్డుకుంటున్నారని విమర్శించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మార్కెట్‌యార్డు పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవసభలో మంత్రి మాట్లాడారు. జూరాల ద్వారా నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ద్వారా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని, పాలమూరు ఎత్తిపోతలను జూరాలకు కలపడం ద్వారా ఈ ప్రాంత ప్రజలు నష్టపోతారని చెప్పారు.



శ్రీశైలం ఆంధ్రావాళ్లకు అప్పగించి పోతిరెడ్డిపాడు నుంచి వచ్చే నీళ్లన్నీ అటు పోవాలన్నదే ప్రతిపక్షాల ఆలోచనగా ఉందని ఆరోపిం చారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా మహబూబ్‌నగర్, కోస్గి, కొడంగల్, నారాయణపేట ప్రాంతాలు లబ్ధి పొందుతాయని మంత్రి అన్నారు. తుమ్మిళ్లలో మూడు రిజర్వాయర్లు కావాలని స్థానిక నాయకుల కోరిక మేరకు మళ్లీ రూ.766 కోట్లతో ప్రతిపాదనలు తెప్పించుకున్నామని, పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హరీశ్‌రావు పేర్కొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకానికి టెక్నికల్ అనుమతులు పొంది 37 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హరీశ్ అన్నారు.



 ప్రతి మండలానికి గోదాం

 టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని మంత్రి తెలిపారు. మండలానికో గోడౌన్ ఏర్పాటులో భాగంగా రాష్ట్ర వ్యాప్తం గా రూ.1024 కోట్లు ఖర్చుచేసి 17లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు నిర్మించనున్నట్లు తెలిపారు.



 భూసేకరణకు రైతులు సహకరించాలి

 ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క చెరువునైనా బాగుచేసిందా? అని ప్రశ్నిం చారు. నెట్టెంపాడు కింద రూ.270 కోట్లు ఖర్చుచేసి ఏడు టీఎంసీల నీటితో 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్నామని చెప్పారు. మరో రూ.500 కోట్లు ఖర్చు చేసి నెట్టెంపాడు ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు. 1200 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని, రైతులు సహకరించాలని కోరారు. సీఎం మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పెండింగ్ ప్రాజెక్టులను వెం టనే పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా ఉల్లి రైతులకు నష్టం రాకుండా రూ.20 కోట్లు ఖర్చుచేసి ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. పత్తి రైతులకు ప్రస్తుతం రూ.ఐదువేల ధర పలుకుతుందని, ప్రభుత్వ ధర రూ.4;160 మాత్రమే ఉండటం వల్ల రైతులకు నష్టం జరగొద్దనే సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించలేదన్నారు. వారం రోజుల్లో గద్వాల పత్తి మార్కెట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటావని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మార్కెట్ చైర్‌పర్సన్ బండ్ల లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.

 

 రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్

 రైతులకు 9 గంటల విద్యుత్ అందిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ట్రాన్‌‌సఫార్మర్లు, 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఏ ఒక్క రైతు మోటార్లు కాలిపోవడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు రోజూ మోటార్లు కాలిపోరుు ఇబ్బందులు ఎదుర్కొనేవారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఎంత నాణ్యమైన విద్యుత్ ఉందో అరుుజ మండలంలో సైతం అలాంటి విద్యుత్‌ను అందించాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top