తనూజ మృతిపై అనుమానాలెన్నో...

ఎంత పనిచేశావు చిట్టితల్లీ! - Sakshi


 పెందుర్తి: తల్లి మందలించిందని జనారణ్యంలోకి అడుగు పెట్టిన బాలిక.. కొద్ది గంటలు కూడా కాకముందే ప్రాణాలు పోగొట్టుకుంది. ఓ యువకుడితో మాట్లాడిందని అమ్మ మందలించడంతో అలిగి బయటకు రావడమే ఆమె పాలిట శాపమైంది. బాలిక మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెందుర్తి పోలీస్‌స్టేషన్ పరిధి కృష్ణరాయపురంలో జరిగిన ఈ ఘటన నగరవ్యాప్తంగా సంచలనం రేపింది.


వివరాలివి.. కృష్ణరాయపురంలో నివాసం ఉంటున్న కె.నాగేశ్వరరావు, అరుణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో చిన్నకుమార్తె తనూజ (14) పురుషోత్తపురంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రోజూ ఇంటి నుంచి పాఠశాలకు నడుచుకుని వెళ్లివస్తుంది. శనివారం తనూజ పాఠశాల నుంచి ఓ యువకుడితో కలిసి వస్తుండగా ఆమె అక్క చూసింది. విషయాన్ని తల్లికి చెప్పడంతో శనివారం రాత్రి తనూజని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన తనూజ ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఉంటున్న స్నేహితురాలి వద్దకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.


అయితే అదే అపార్ట్‌మెంట్ వద్ద ఆమె స్నేహితురాలు ఉంటున్న ఫ్లాట్‌కి కింద ఉన్న గోడకు ఆనుకుని తనూజ మృతదేహం ఆదివారం ఉదయం కనిపించింది. దీంతో స్థానికులు తనూజ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి దిలీప్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. యువకుడి తల్లిదండ్రులను కూడా ప్రశ్నిస్తున్నారు. తనూజ మృతదేహానికి వైద్యులు ఇవాళ పోస్ట్మార్టం నిర్వహించనున్నారు.



అనుమానాలెన్నో..  



మరోవైపు తనూజ మరణం మిస్టరీగా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తనూజ స్నేహితురాలు ఉంటున్న అపార్ట్‌మెంట్ వైపు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తనూజ స్నేహితురాలి వద్దకు వెళ్లి ఉంటే ఆ సమాచారం తల్లిదండ్రులకు చేరేది. ఎందుకంటే తనూజ రాత్రి 7 గంటలకు బయటకు రాగా రాత్రి 1 గంట వరకు ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం గాలిస్తున్నారు. స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసిన తరువాత రాత్రి 1 గంటకు పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే తనూజ వెళ్లినట్టు చెబుతున్న స్నేహితురాలిని కూడా వీరు ఆరా తీసి ఉంటారు. మరో కోణంలో చూస్తే తనూజ మాట్లాడిన యువకుడు ఓ బ్యాచ్ తో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తనూజ ఆ యువకుడిని కలిసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ గ్యాంగ్‌తో కలిసి తనూజపై ఆ యువకుడు లైంగికదాడికి పాల్పడి ఆమెను హతమార్చాడా అన్నది మరో అనుమానం. తనూజ మృతదేహంపై సగం వస్త్రాలు, రక్తస్రావం ఆనవాళ్లు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఆమె ముఖంపై మాత్ర మే తీవ్ర గాయాలుండడంతో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందనుకోవడానికి ఆస్కారం తక్కువ. తనూజను హతమార్చి ఈ అపార్ట్‌మెంట్ వద్ద మృతదేహాన్ని పడేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.  ఘటనా స్థలానికి వంద మీటర్ల దూరంలో పోలీసుల నైట్‌బీట్ పాయింట్ ఉండడం గమనార్హం.

 

ముమ్మర దర్యాప్తు  



తీవ్ర సంచలనం రేపిన తనూజ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఏసీపీ భీమారావు, సీఐ జె.మురళి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులతో పాటు స్నేహితులను, స్థానికులను విచారించారు. తనూజతో మాట్లాడినట్లు చెబుతున్న యువకుడిని తక్షణమే అదుపులోనికి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి తనిఖీ చేయించారు. ఘటనపై సీపీ యోగానంద్ ఫోన్ ద్వారా ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ భీమారావ్ మాట్లాడుతూ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక మరిని నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top