వేసవి వచ్చిందంటే అతనికి నరకయాతన

వేసవి వచ్చిందంటే అతనికి నరకయాతన


అరుదైన వ్యాధితో నరకయాతన

స్వేదగ్రంథులు లేక  దహించుకుపోతున్న పదేళ్ల బాలుడు


 

నోరు తెరిస్తే వేడివేడి.. కళ్లు మూస్తే కన్నీటి తడి.. ఆవలిస్తే ఆవిరేఆవిరి.. ఊపిరంతా ఉక్కిరిబిక్కిరి.. నిండా పదేళ్లు కూడా నిండని ఈ బాలుడి దుస్థితి. వేసవి వచ్చిందంటే చాలు మండిపోతున్న భూగోళంలా మారిపోతుంది ఇతని శరీరం. చెమట బయటకు రాక.. నిత్యం నిప్పులకొలిమిలా శరీరం దహించుకుపోతూ నరకయాతన అనుభవిస్తున్నాడు. ఎప్పుడూ తడి కండువా కప్పుకొంటూ, కుళాయిల్లో శరీరాన్ని తడుపుకొంటూ జీవిస్తున్నాడు. అరుదైన వ్యాధి కుమారుడ్ని కుంగదీసేస్తున్నా పేదరికంతో బాధను గుండెల్లోనే  దిగమింగుతున్నారు ఆ తల్లిదండ్రులు
.

 

 

నూజెండ్ల : గుంటూరు జిల్లా ముక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శింగంశెట్టి వెంకట సాయిపవన్‌కుమార్ అనే పదేళ్ల బాలుడు పుట్టుకతోనే స్వేదగ్రంథులు లేకుండా జన్మించాడు. జన్యుపరమైన వ్యాధితో వెంట్రుకలు కూడా రాని పరిస్థితి. తల్లిదండ్రులు మల్లీశ్వరి, ఆదిశేషయ్య ఎంతోమంది డాక్టర్లకు చూపించారు. అయినా ఫలితం లేదు. ప్రస్తుతం ముక్కెళ్లపాడు ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలుడు వేసవి వచ్చిందంటే చాలు నరకయాతన అనుభవిస్తాడు. చెమట బయటకు పోక తీవ్రమైన ఉక్కపోతకు గురై అల్లాడిపోతుంటాడు. ఎప్పుడూ చల్లటి వాతావరణంలో ఉంచాలని, ఏసీ లేదా కూలర్ ఏర్పాటు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.



పేద కుటుంబం  కావడంతో సాయి తడికండువా కప్పుకొంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. తపానికి తాళలేక బడిలో కుళాయిల కింద, బజార్లలో బోర్ల కింద నిత్యం తల తడుపుకొంటుంటాడు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పిల్లలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాల్సిన వైద్యశాఖ అధికారులు ఈ బాలుడిని పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ప్రభుత్వానికి నివేదించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రత్యేక  వికలాంగుల కేటగిరీలో పింఛను ఇప్పించాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 చిన్నతనం నుంచీ ఇంతే..


 మా బాబు స్వేద గ్రంథులు లేకుండా పుట్టడంతో చిన్నవయసులో చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక చాలా బాధపడేవాళ్లం. మూడేళ్ల వయసులో గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో చూపించగా, స్వేద గ్రంథులు లేకుండా పుట్టాడని, చల్లని వాతావరణంలో ఉంచాలని చెప్పారు. ఏసీ ఏర్పాటుచేసే స్థోమత మాకు లేదు. పింఛన్ కోసం అధికారులకు  మొరపెట్టుకున్నా ఫలితం లేదు. - శింగంశెట్టి ఆదిశేషయ్య, బాలుడి తండ్రి

 

 చల్లటి వాతావరణంలో ఉంచాలి


 ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలను శీతల బాలుడు అంటారు. లక్షల్లో 10 శాతం మంది పిల్లలకు మాత్రమే ఈ తరహా వ్యాధి సోకుతుంది. వేసవిలో నీడపట్టున ఉంచడం, చల్లటి వాతావరణంలో ఉంచడం వంటివి చేయాలి. వయసు పెరిగే కొద్దీ ఈ వ్యాధిని ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. మజ్జిగ, రాగి జావ ఎక్కువగా ఇవ్వాలి. -  లెనిన్‌రెడ్డి, వైద్య నిపుణుడు, వినుకొండ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top