స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ తొలగింపు


తిరుపతి : స్విమ్స్ (శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞానసంస్థ) డెరైక్టర్ డాక్టర్ వెంగమ్మను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె స్థానంలో ఇంఛార్జ్ బాధ్యతలను టీటీడీ జేఈవో కోలా భాస్కర్కు అప్పగించారు. స్విమ్స్ డైరెక్టర్ గా వెంగమ్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధి వేగవంతమైన విషయం తెలిసిందే. అయితే, కొన్ని నెలలుగా స్విమ్స్ లో జరుగుతున్న పరిణామాలు ఆమెను తీవ్రంగా బాధించిన నేపథ్యంలో వ్యక్తిగత కారణాల పేరిట ఆమె రాజీనామా చేశారు.



కానీ, అంతకుముందు జిల్లా పర్యటనకు వచ్చిన వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు డాక్టర్ వెంగమ్మను పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు చేసినట్టు సమాచారం. ఇంతకుమునుపే ఆమెను స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగేలా చేసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ప్రభుత్వం పాచికగా ప్రయోగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్విమ్స్‌లోని కొన్ని పైళ్లను తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ తనిఖీల్లో ఎలాంటి ఆరోపణలు, అవినీతి ఆధారాలు లభించకపోగా డెరైక్టర్ నిక్కచ్చిగా వ్యవహరించినట్టు ప్రాథమిక సమాచారం అందింది. 



దీంతో స్విమ్స్ డెరైక్టర్ పదవి నుంచి వెంగమ్మను తప్పించి, తమకు అనుకూలమైన వారిని నియమించుకోనేందుకు వీలుగా చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే స్విమ్స్ డెరైక్టర్ వెంగమ్మను కుప్పానికి పిలిపించుకుని పదవి నుంచి తప్పుకోవాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుగుదేశం వర్గాల్లోనే చర్చ జరిగింది. ఈలోగానే స్విమ్స్ డైరెక్టర్గా వెంగమ్మను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top