నా బిడ్డను చంపేశారు

విలపిస్తున్న చిరంజీవి తల్లి (ఇన్సెట్లో) చిరంజీవి ఫైల్ - Sakshi


* అనుమానాస్పద స్థితిలో మరో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

* పథకం ప్రకారమే హత్య చేశారంటున్న తల్లి


బిట్రగుంట : కావలిలో అనుమానాస్పద స్థితిలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెంది నాలుగు రోజులు గడవకముందే అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు. మండలంలోని కడనూతల ఫారెస్ట్ ఏరియాలో విద్యార్థి మృతదేహం మంగళవారం బయటపడింది. సంఘటనా స్థలంలో లభించిన కళాశాల గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డులను బట్టి మృతుడు నాయుడుపేట మండలం విన్నమాలకు చెందిన వేలూరు చిరంజీవి (20)గా గుర్తించారు. స్థానికులు, పోలీసుల , కళాశాల యాజమాన్యం కథనం మేరకు..



విన్నమాలకు చెందిన వేలూరు చిరంజీవి కావలిలోని విట్స్ (విశ్వోదయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) కళాశాలలో బీటెక్ (మెకానికల్ ఇంజనీరింగ్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలకు చెందిన విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తుండటంతో విద్యార్థిని తల్లిదండ్రులు కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మే నెల 5వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడం, చిరంజీవి వ్యవహారశైలి సరిగా లేకపోవడంతో కళాశాల యాజమాన్యం అతడిని వసతిగృహం నుంచి బయటకు పంపేసింది.



దీంతో అతను కావలిలోనే గది అద్దెకు తీసుకుని పరీక్షలు రాస్తున్నాడు. ఈక్రమంలో 27వ తేదీన పరీక్ష రాయాల్సి ఉండగా గైర్హాజరయ్యాడు. అప్పటి నుంచి చిరంజీవి ఆచూకీ లేదు. మృతదేహం ఉన్న విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ నీలిమ భర్త మల్లికార్జున్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

27వ తేదీనే హత్య..?

చిరంజీవిది హత్యగా అనుమానిస్తున్నారు. 27వ తేదీనే హత్య జరిగినట్లు సంఘటనా స్థలంలోని ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఆరోజు వేకువన కావలి నుంచి పల్లెవెలుగు బస్సులో చిరంజీవి కడనూతల వచ్చినట్లుగా మృతుడి పర్స్‌లో టికెట్ లభించింది. టికెట్‌పై ఉదయం 4.38గా సమయం నమోదైంది. కావలి నుంచి పల్లెవెలుగు బస్సులు ఉదయం ఐదు గంటల నుంచి మాత్రమే ఉన్నాయి. వేకువనే 4.38గా సమయం నమోదై ఉందంటే బస్టాండ్‌లో ప్రయాణికుల కోసం బస్సు వేచి ఉన్న సమయంలోనే టికెట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.



మృతుడి జేబులో ఫోన్‌లేదు. కేవలం ఇయన్‌ఫోన్స్ మాత్రం ఉన్నాయి. కాళ్లకు చెప్పులు కూడా లేవు.  మృతదేహం పక్కన బైక్ చక్రాల గుర్తులున్నాయి. మృతుడి జేబులో మూడు ఖాళీ నిద్ర మాత్రల షీట్లు (45 మాత్రలు, రెస్టిల్ 0.5ఎంజీ) లభించాయి.  నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే కావలి నుంచి కడనూతల అటవీ ప్రాంతం వరకూ చెప్పులు కూడా లేకుండా రావాల్సిన అవసరం లేదని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

రెండూ అనుమానాస్పద సంఘటనలే..

కావలి విట్స్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వేర్వేరు ఘటనల్లో అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా మారడం సంచలనం రేపుతోంది. రెండు సంఘటనలూ గంటల వ్యవధిలోనే జరగడం మిస్టరీగా మారింది. 27వ తేదీ వేకువన 2.30 గంటల ప్రాంతలో వసతిగృహం పైనుంచి పడి అనుమానాస్పద స్థితిలో బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి మృతదేహం లభ్యమవడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పోలీసులు భిన్నకోణాల్లో దర్యాప్తు చేపడితే వాస్తవాలు వెలుగు చూడటంతో పాటు ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.

 

చిరంజీవి తల్లి పుష్ప

కావలి: ‘నా బిడ్డను చెప్పిమరీ చంపేశారు. ఇక నాకు దిక్కెవరు?’ అంటూ కడనూతలలో లభ్యమైన చిరంజీవి మృతదేహం వద్ద తల్లి పుష్ప రోదించింది. మంగళవారం రాత్రి పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి వచ్చి చిరంజీవి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయుడుపేటకు చెందిన రెడీమెడ్ షాపు యజమాని వాసు ఆయన అన్న వెంకటేశ్వర్లు పథకం ప్రకారం నా బిడ్డను కడతేర్చారని ఆరోపించింది. లేనిపోని ఆరోపణలతో తన బిడ్డను అంతం చేశారని విలపించింది.   తనకు పోలీసులపై నమ్మకంలేదని, పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి హత్యకు కారణమైన వారిని పట్టుకుని శిక్షించాలని పుష్ప కోరింది.  

 

రెండు ఘటనలకు సంబంధంలేదు


కావలిలో మిద్దెపై నుంచి పడి మృతిచెందిన కాలే జీ విద్యార్థి ఘటనకు, మంగళవారం కడనూతల అటవీ ప్రాం తాల్లో లభ్యమైన చిరంజీవి మృతదేహం ఘటనకు ఎలాంటి సంబంధంలేదు. కడనూతల ఘటనపై బిట్రగుంట పోలీ సుల ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. పుర్వాపరాలు త్వరలో వెల్లడవుతాయి.     

- వెంకటరమణ, సీఐ, కావలి రెండో పట్టణం

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top