టెన్త్‌ ఫలితాలపై ఉత్కంఠ

టెన్త్‌ ఫలితాలపై ఉత్కంఠ


నేడు విడుదల



- కొత్త జిల్లాలో పురోగమనమా.. తిరోగమనమా?

- ప్రభావం చూపనున్న ఫిజిక్స్‌ పేపర్‌

- 67 కేంద్రాలు..11,125 మంది విద్యార్థులు హాజరు




పాపన్నపేట(మెదక్‌): మరి కొన్ని గంటల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కాబోతున్నాయి.ఈ  తరుణంలో విద్యార్థులంతా ఊపిరి బిగపట్టి ఉత్కంఠతకు లోనవుతున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో అధికారులు సైతం టెన్షన్‌కు లోనవుతున్నారు. గత యేడాది సాధించిన ఫలితాల కన్నా మెరుగైన లక్ష్యాన్ని సాధించాలనే తపన అన్ని వర్గాల్లో కన్పడుతోంది. అయితే ఈయేడు ఫిజిక్స్‌ పేపర్‌ విద్యార్థుల స్థాయికి మించి ఉండటంపై పలు విమర్శలు వ్యక్తం కాగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. పరీక్షల్లో ఐదు నిమిషాల ఆలస్యం  నిబంధన.. అరకొర సౌకర్యాలపై విమర్శలు వ్యక్తమయినప్పటికీ మెదక్‌ జిల్లాలో యే ఒక్క మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదు కాకపోవడం.. పరీక్షలు అయిన కేవలం 33 రోజుల్లో ఫలితాలు ప్రకటించడం ఆశావాహ పరిణామాలు గానే భావించవచ్చు..



పతో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కాగా 30వ తేదీతో ముగిశాయి.   జిల్లా నుండి 11,125 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. మొత్తం 67 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందుకుగాను ముగ్గురు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 20 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లతో బాటు ఇతర డిపార్ట్‌మెంట్లకు చెందిన 67 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు పూర్తి అయినప్పటికీ.. ఫిజిక్స్‌ పేపర్‌ ప్రశ్న పత్రం కూర్పు పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఇందు కోసం వేసిన నిపుణుల కమిటీ ఎట్టకేలకు  4 మార్కుల ప్రశ్న విద్యార్థుల స్థాయికి మించి ఉన్నట్లుగా నిర్ధారించింది. ఈ ప్రశ్న రాసేందుకు యత్నించిన విద్యార్థులకు 4 మార్కులు ఇస్తామని ప్రకటించింది. అయితే విద్యార్థులు మాత్రం తమకు అర్థం గాని ఆ ప్రశ్నను వదిలేశామని దీనివల్ల తమకు అన్యాయం జరిగి ..తమ జీపీఏ పై ప్రభావం చూపుతుందని.. అందరికీ మార్కులు కలపాలని ఆందోళన వ్యక్తం చేసినా ఫలితం లేకుండా పోయింది



గతేడాది 90.74 శాతం.. రాష్ట్రంలో 3 వ స్థానం

గత ఐదేళ్లలో పదో తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే మెదక్‌ జిల్లా ఫలితాల సాధనలో ఉత్థాన.. పతనాలు కనిపిస్తాయి. 2011–12 విద్యాసంవత్సరంలో అప్పటి ఉమ్మడి జిల్లాలో 41,292 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 37,483 విద్యార్థులు ఉత్తీర్ణులై 90.78 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 8వ స్థానం సంపాదించారు. 2012–13లో 40,842 మంది పరీక్షలు రాయగా కేవలం 27,757 మంది ఉత్తీర్ణులై జిల్లాలో 67.96 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 23 వ స్థానానికి దిగజారారు. 2013–14లో 40.090 మంది పరీక్షలు రాయగా 33,277 మంది ఉత్తీర్ణత నొంది 83.01 శాతం సాధించి, రాష్ట్రంలో 21 వ స్థానం నిలిచారు. 2014–15లో 42085 మంది పరీక్షలు రాయగా 36.603 మంది పాస్‌ కాగా, 86.97 శాతం ఉత్తీర్ణత సాధించి  జిల్లా రాష్ట్రంలో 3 వ స్థానం సంపాదించారు.. 2015–16 గతేడాది ఉమ్మడి జిల్లాలో 42,996 మంది పరీక్షలు రాయగా 39,016 మంది పాసై, 90.74 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో తిరిగి 3వ స్థానంలో నిలిచారు.అయితే కొత్త జిల్లాలో ఉత్తీర్ణత శాతం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top