క్రీడాభివృద్ధికి ప్రణాళిక

క్రీడాభివృద్ధికి ప్రణాళిక


కడప స్పోర్ట్స్‌ :


జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులందరూ క్రీడాభివృద్ధికి కంకణబద్ధులు కావాలని జిల్లా కలెక్టర్‌ కె.వి. సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం కడప నగరంలో నూతన కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో రాణించిన వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ జాతీయస్థాయిలో రాణించే విద్యార్థుల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. క్రీడలు అన్నది మనసుకు సంబంధించిన అంశమన్నారు. ఎవరి ప్రోద్భలంతోనో కాక మన ఇష్టంతో క్రీడల్లో ప్రవేశిస్తేనే రాణించగలమన్నారు. ఒక వెయ్యిమంది విద్యార్థుల్లో 10 మంది మాత్రమే క్రీడాకారులుగా రాణించగలరన్నారు. క్రీడను వృత్తిగా ఎంచుకున్న వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని ఆసక్తితో పాటు వారి శారీరక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రోత్సహించాలని సూచించారు. 120 కోట్లకుపైగా జనాభా ఉన్న మనదేశంలో కేవలం 2 ఒలంపిక్‌ పతకాలు మాత్రమే రావడం బాధాకరమన్నారు. రాజకీయ విషవలయంలో క్రీడలు చిక్కుకోవడం వలనే పతకాల పట్టికలో చిన్నదేశాల కన్నా వెనుకబడ్డామన్నారు. కొన్ని అసోసియేషన్‌ల గుప్పిట్లో క్రీడలు చిక్కుకోవడంతో క్రీడలకు నష్టం జరుగుతోందన్నారు. జిల్లాలోని క్రీడాసంఘాల్లో రాజకీయాలను ఉపేక్షించమని తెలిపారు. జిల్లా నుంచి వ్యాయామ ఉపాధ్యాయులకు, క్రీడలకు ఏ అవసరం ఉన్నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. అయితే జిల్లా నుంచి కనీసం 10 క్రీడాకారులను అంతర్జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు సైతం శారీరక ధారుడ్యం కలిగిఉండి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు. క్రీడల్లో ఎక్కువ సేపు సాధన ఒక్కటే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంచుకోవాలని సూచించారు. ఫిజికల్‌ టెక్నిక్స్‌తో పాటు ఫిజికల్‌ డైమన్షన్స్‌ విద్యార్థులకు తెలియజెప్పాలన్నారు. వారంలో ఒక రోజు ఆరోగ్యవిద్యకు, ఒకరోజు క్రీడల గురించి చెబుతూ చిన్నారుల్లో స్ఫూర్తినింపాలని సూచించారు. రాష్ట్రంలోని ఏకైక క్రీడాపాఠశాల, డీఎస్‌ఏలలో క్రీడాభివృద్ధి కోసం 100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అదే విధంగా జిల్లాలోని క్రీడాకారుల కోసం క్రీడాభవన్‌ నిర్మించేందుకు స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో క్రీడలను ప్రోత్సహిస్తే ఎందరో సింధులు, దీపా కర్మాకర్‌లు పుట్టుకువస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్దపీఠ వేస్తోందని ఆయన పేర్కొన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ పాఠశాలలో క్రమశిక్షణకు పెట్టిందిపేరు వ్యాయామ ఉపాధ్యాయులన్నారు. మౌత్‌ పవర్‌కన్నా, మజిల్‌ పవర్‌ కన్నా విజల్‌ పవర్‌ గొప్పదని వ్యాయామ ఉపాధ్యాయుల్లో స్ఫూర్తినింపారు.


వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ గతంలో హామీ ఇచ్చిన విధంగా నెరవేరుస్తున్నామన్నారు. అన్నమాచార్య విద్యాసంస్థల చైర్మన్‌ చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. పి.వి.సింధును ఆదర్శంగా తీసుకుని క్రీడాకారులు రాణించాలని సూచించారు. ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌జీఎఫ్‌ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు అయ్యే ఖర్చులను అందజేయాలని కోరారు. త్వరలోనే వ్యాయామ ఉపాధ్యాయులకు ఓరియంటేషన్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులచే క్రీడాప్రతిజ్ఞను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామసుబ్బరాజు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కిరణ్, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి సునీల్, రీజినల్‌ స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ మురళీకృష్ణ, అథ్లెటిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నరసరాజు, దాతలు నరసింహ, సుధీర్, భాస్కర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top