‘ఆత్మహత్య చేసుకుంటున్నాను..’

‘ఆత్మహత్య చేసుకుంటున్నాను..’ - Sakshi


పోలీసులు, మీడియాకు గంగాస్థాన్‌ వాసి వాట్సాప్‌ మెస్సేజ్‌లు..

రంగంలోకి దిగి వెతుకుతున్న పోలీసు బృందాలు

పోలీసులు, అధికార పార్టీ నేతల వేధింపులే కారణం అంటూ లేఖ..

కలకలం రేపిన వైనం




నిజామాబాద్‌: ‘నాకు జరిగిన మోసానికి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోవడం లేదు.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల తలొగ్గి కేసుల పేరుతో తిరిగి వేదిస్తున్నారు.. ఈ విషయం పోలీసు, జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినా వారు కూడా పట్టించుకోవడం లేదు.. దీంతో నిరాశ, నిస్ప్రహలతో.. మనోవేదనకు గురై కుంగుబాటుకు లోనయ్యాను..’ అంటూ లేఖతో పాటు ఆత్మహత్య చేసుకుంటున్నానని నిజామాబాద్‌ నగర శివారులోని గంగాస్థాన్‌కు చెందిన టి.రాజేశ్‌కుమార్‌ అనే వ్యక్తి వాట్సాప్‌ మెస్సేజ్‌లు పంపారు. ఈ మెస్సేజ్‌లు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు కూడా వెళ్లడంతో జిల్లా పోలీసులు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే రాజేశ్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజేశ్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను సైతం ఆరా తీశారు. రాజేశ్‌కుమార్‌కు ముంబైలో స్థిరపడిన మోర్తాడ్‌ మండలానికి చెందిన మహిళతో 2015 డిసెంబర్‌లో వివాహం జరిగింది. వివిధ కారణాలతో వివాహం జరిగిన కొన్ని నెలలకే వీరిద్దరికి విభేదాలు తలెత్తాయి. కొన్ని నెలలుగా వీరిద్దరు కలిసి ఉండడం లేదు. ఈ క్రమంలో రాజేశ్‌కుమార్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేశ్‌పై మోర్తాడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో 498 ఏ కింద వరకట్న వేధింపుల కేసు నమోదైంది.



ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా తనను పెళ్లి చేసుకునే కంటే ముందే తన భార్య మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని, అతనితో శారీరక సంబంధం కూడా పెట్టుకుందని రాజేశ్‌ వాట్సాప్‌లో పంపిన లేఖలో ఆరోపించారు. తన భార్య, ఆమె తల్లిదండ్రులు తనను మోసం చేసి పెళ్లి జరిపించారని, తనకు జరిగిన మోసానికి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోలేదని రాజేశ్‌ ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకు పోలీసులు తిరిగి తననే వేధిస్తున్నారని లేఖలో వాపోయారు. తనకు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని రాజేశ్‌ వాట్సాప్‌లో పంపిన లేఖలో పేర్కొన్నారు. అందుకే తాను కుంగుబాటుకు లోనయ్యానని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వాట్సాప్‌లో సందేశాలు పంపారు. ఈ సందేశాలు పోలీసు ఉన్నతాధికారులతో పాటు, మీడియా ప్రతినిధులకు కూడా వచ్చాయి.



రాజేశ్‌ కోసం గాలింపు..

తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పోలీసులకు మెస్సేజ్‌లు రావడంతో హైరానా పడిన పోలీసులు రాజేశ్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సమాచారం. సందేశం వచ్చిన సెల్‌ నెంబర్‌ సిగ్నల్‌ టవర్‌ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌ మేరకు రాజేశ్‌ కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయని నిజామాబాద్‌ ఏసీపీ ఆనంద్‌కుమార్‌ ‘సాక్షి’తో పేర్కొన్నారు. రాజేశ్‌ తండ్రితో కూడా మాట్లాడామని చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top