రైతు ఎస్‌ఎంఎస్‌ ఇస్తేనే సబ్సిడీ


 జంగారెడ్డిగూడెం : ఎరువులపై ఇచ్చే సబ్సిడీ విషయంలో ప్రభుత్వం కొత్త విధానం అమలు చేయనుంది. ఎరువులు కొన్న రైతులకు నేరుగా నగదు బదిలీ రూపంలో సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తొలుత భావించిన విషయం విదితమే. అయితే, ఈ పద్ధతిలో చెల్లింపులు సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. నూతన విధానం ప్రకారం ఎరువుల కంపెనీలు నిర్ణయించిన ఎరువుల గరిష్ట అమ్మకం ధరలో ప్రభుత్వం నిర్ధేశించిన సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి రైతుకు వాటిని విక్రయిస్తారు. ఎరువులు అవసరమైన రైతు తన ఆధార్‌ కార్డును డీలర్‌ వద్దకు తీసుకెళ్లి ఈ–పోస్‌ విధానంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం తాను కొన్న ఎరువుల వివరాలను తన సెల్‌ఫోన్‌ నుంచి ఈ–పోస్‌కు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం సదరు ఎరువు కంపెనీకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని చెల్లిస్తుంది.

‘పశ్చిమ’లో ప్రయోగాత్మకంగా అమలు

ఈ నూతన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. మన రాష్ట్రంలో కష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్టోబర్‌ 1నుంచి దీనిని అమలు చేయబోతున్నారు. ఈ విధానం వల్ల ఎరువుల దుర్వినియోగాన్ని నిరోధించడంతోపాటు దేశవ్యాప్తంగా ఎరువుల వినియోగం ఏమేరకు జరుగుతందనే విషయం కచ్చితంగా తెలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎరువులు పక్కదారి పట్టడం, పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం, బ్లాక్‌ మార్కెటింగ్‌ తదితర అవినీతి వ్యవహారాలకు అడ్డుకట్టపడుతుందనేది కేంద్రం భావన. ఇప్పటివరకు కంపెనీల నుంచి ఎరువులు డీలర్ల ద్వారా రిటైల్‌ వ్యాపారులకు చేరిన తరువాత కంపెనీ ఇచ్చిన లెక్క ప్రకారం సబ్సిడీని సదరు కంపెనీలకు ప్రభుత్వం చెల్లిస్తోంది.  ఈ విధానంలో ఎరువులు పక్కదారి పట్టడంతో కేంద్ర ప్రభుత్వంపై సబ్సిడీ భారం అధికమవుతోంది. దీనిని అరికట్టేందుకు ఇటీవల ఈపోస్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కొత్త విధానాన్ని అమలు చేయనుంది.దీనికోసం కంప్యూటర్‌ ఆధారిత డిజిటల్‌ నెట్‌వర్క్‌ను వినియోగిస్తుంది. ఎరువులు అమ్మే సమయంలో రైతుల వివరాలను ఇందులో నమోదు చేయాలి. ఎరువులు కొనుగోలు చేసిన తరువాత రైతు తన మొబైల్‌ఫోన్‌ ద్వారా ఫెర్టిలైజర్స్‌ మోనిటరింగ్‌ వ్యవస్థకు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. ఈ ఎస్‌ఎంఎస్‌ అందిన తరువాత ఏ కంపెనీ ఎరువును, ఏ రైతు, ఎంతకు కొన్నాడో నిర్ధారించుకుని ఆ కంపెనీకి ప్రభుత్వం సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తుంది. 

సబ్సిడీ ఇలా..

కేంద్ర ప్రభుత్వం ఎరువుల్లో వినియోగించే మూల పదార్థాలైన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, సల్ఫర్‌ శాతాన్ని లెక్కించి వాటి ఆధారంగా కంపెనీలకు సబ్సిడీ చెల్లిస్తోంది. 2016–17 సంవత్సరాలకు సంబంధించి టన్ను నైట్రోజన్‌పై రూ.15,854, ఫాస్పరస్‌పై రూ.13,241, పొటాష్‌పై రూ.15,470, సల్ఫర్‌పై రూ.2,044 చొప్పున సబ్సిడీ ఇస్తోంది.

అమలు సాధ్యమేనా!

జిల్లాలో రైతులు, కౌలు రైతుల కలిపి సుమారు 5 లక్షల మంది ఉన్నారు. వీరంతా ఖరీఫ్‌లో 1.64 లక్షల మెట్రిక్‌ టన్నులు, రబీలో 2.33 లక్షల టన్నుల ఎరువులను వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా జిల్లాలో ప్రై వేట్‌ డీలర్లు, ఎరువులు విక్రయించే సొసైటీలు, డీసీఎంఎస్‌ విక్రయ కేంద్రాలు కలిపి 1,160 అవుట్‌లెట్స్‌ ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా, కొత్త విధానం అమలు సాధ్యమయ్యే పనేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల్లో చదువుకున్న వారు తక్కువగా ఉంటారని, వారు ఎరువులు కొనుగోలు చేసిన తరువాత ఎస్‌ఎంఎస్‌ పంపించడంలో ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేగాక ఎరువులు వినియోగించే వారిలో ఎక్కువ శాతం కౌలు రైతులే. కొత్త విధానం వల్ల వారికి తప్పవని పలువురు పేర్కొంటున్నారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top