‘గుడ్డి’ నిర్ణయం.. బతుకు అంధకారం !

‘గుడ్డి’ నిర్ణయం.. బతుకు అంధకారం ! - Sakshi


- స్కూల్ హాల్ టికెట్‌లో ఓ విద్యార్థి అంధుడిగా నమోదు

- నవోదయలో సీటు కోల్పోయిన వైనం..

 

 షాద్‌నగర్ రూరల్: పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉండి చదువులో చురుకుగా ఉండే బాలుడిని ఆ పాఠశాల యాజమాన్యం అంధుడి కింద రికార్డులో చూపింది. దీంతో నవోదయలో చేరాల్సిన విద్యార్థి తిరిగి ఇంటి దారి పట్టాడు. తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని అతని తండ్రి అధికారులు, పోలీసులతో మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం తొండపల్లికి చెందిన లక్ష్మికాంత్‌రెడ్డి, రజిత దంపతులు పదేళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో నివాసముంటున్నారు.



వీరి కుమారుడు అభిషేక్‌రెడ్డి నర్సరీ నుంచి పట్టణంలోని మాంటెస్సోరి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న అభిషేక్‌రెడ్డి.. 2016-2017 సంవత్సరానికిగాను నవోదయ ప్రవేశ పరీక్షను రాసి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 23న తన తండ్రితో కలసి జిల్లాలోని వట్టెం నవోదయ పాఠశాలకు వెళ్లాడు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. అభిషేక్‌రెడ్డిని చూసిన నవోదయ సిబ్బంది.. బాబు గుడ్డివాడని, హాల్ టికెట్‌లో అలా నే ఉందని, విద్యార్థిని చూస్తే అంధుడిగా కనిపించడం లేదని తండ్రిని ప్రశ్నించగా అతను ఒక్కసారిగా అవాక్కయ్యారు. బాలుడికి అంధుల కోటాలో పాఠశాలలో సీటు వచ్చిందని, కళ్లు కనిపిస్తుండడంతో ఆ కోటాలో సీటు ఇవ్వలేమని ఇంటికి పంపించారు. ఉన్న చూపును పోగొట్ట లేక, నవోదయ పాఠశాలలో సీటు రాక తండ్రీకొడుకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అభిషేక్‌రెడ్డి విషయంలో అతను చదువుతున్న మాంటెస్సోరి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.



 కలెక్టర్‌ను కలసిన బాధితుడు: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే తమ కుమారుడికి నవోదయ పాఠశాలలో సీటు రాలేదని అభిషేక్ రెడ్డి తన తండ్రితో కలసి మంగళవారం కలెక్టర్ టీకే శ్రీదేవిని కలిశారు. కష్టపడి చదివినా యాజమాన్యం తప్పిదంతో చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని మొర పెట్టుకున్నారు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.  ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top