'అమ్మా.. క్షమించు'

'అమ్మా.. క్షమించు' - Sakshi


తక్కువ మార్కులొచ్చాయి..

తోటి విద్యార్థుల్లో తలెత్తుకు తిరగలేను

సూసైడ్ నోట్ రాసి రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం


 

మదనపల్లె :

‘అమ్మా.. నన్ను క్షమించు.. నాకు తక్కువ మార్కులు వచ్చాయి.. నన్ను మీరేమి అనలేదు. కాని తోటి విద్యార్థుల్లో నేను తలెత్తుకు తిరగలేకున్నా.. బాగా చదివి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలని అనుకున్నా.. ఇక నేను చదవలేను.. అందుకే చనిపోతున్నా’ అంటూ  సూసైడ్‌నోట్ రాసి ఓ విద్యార్థిని రైలు కిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటన గురువారం చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో జరిగింది. కురబలకోట మండలం అంగళ్లు పంచాయితీ తుమ్మచెట్లపల్లెకు చెందిన సి.సురేంద్ర, ఈశ్వరమ్మల మొదటి కుమార్తె కల్యాణి(15) అంగళ్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. రోజు మాదిరిగానే గురువారం కూడా స్కూల్‌కు వెళ్లింది. ఇటీవల జరిగిన త్రైమాసిక పరీక్ష ఫలితాలను పాఠశాల ఉపాధ్యాయులు అందజేశారు. ఈ ఫలితాల్లో తోటి విద్యార్థుల కంటే తక్కువ మార్కులు రావడం కల్యాణి హృదయాన్ని గాయపరిచింది.

 

తీవ్ర మనోవేదనకు గురై ఆ విద్యార్థిని పాఠశాలలోనే సూసైడ్‌నోట్ రాసుకుని మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలోని తమ్మనగుట్ట రైల్వేస్టేషన్ సమీపానికి వెళ్లి తిరుపతి-ధర్మవరం వెళ్తున్న ప్యాసింజర్ రైలుకిందపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుడికాలు రెండుగా తెగిపోగా తలకు, ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆ బాలికను స్థానికులు గమనించి 108లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకన్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని బిడ్డను చూసి బోరున విలపించారు. ‘ఎంత పనిచేశావు తల్లీ...చదవకపోయినా పర్వాలేదు.. మాకళ్లెదుట ఉంటే అంతే చాలని కన్నీటి పర్యంతమయ్యారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆ బిడ్డను తిరుపతికి తరలించారు. కదిరి రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top