డస్టర్‌ లొల్లి ప్రాణం తీసింది

డస్టర్‌ లొల్లి ప్రాణం తీసింది


క్లాస్‌రూంలో తోటి స్నేహితుడిని మెడపై గుద్దిన విద్యార్థి

కిందపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలిన పదో తరగతి విద్యార్థి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ జెడ్పీ హైస్కూల్‌లో ఘటన




చండ్రుగొండ (అశ్వారావుపేట): వారిద్దరూ ఫ్రెండ్స్‌.. ఒకే క్లాస్‌.. రోజూ కలిసే బడికి వస్తారు.. శుక్రవారం అలాగే వచ్చారు.. తరగతి గదిలో డస్టర్‌ కోసం ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది.. తోటి స్నేహితుడిని నిలువరించే క్రమంలో మెడపై గుద్దాడు రెండోవాడు.. అంతే.. అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలాడు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాను కావాలని కొట్టలేదని, స్నేహితుడు చనిపోతాడని అనుకోలేదంటూ రెండో విద్యార్థి కన్నీరుమున్నీరయ్యాడు. ఇన్‌చార్జి హెడ్‌మాస్టర్‌ ఫిర్యాదు మేరకు ఆ విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు.



గొడవ మొదలైందిలా..

చండ్రుగొండ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన భానుప్రకాశ్‌(16) పదో తరగతి చదువుతున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో విద్యార్థి, ఇతడు స్నేహితులు. శుక్రవారం ఇద్దరూ స్కూలుకు వెళ్లారు. ఉదయం ఫస్ట్‌ పీరియడ్‌ ఇంగ్లిష్‌ క్లాస్‌ జరిగింది. సెకండ్‌ పీరియడ్‌ మొదలవగానే.. స్కూల్‌డే సందర్భంగా జరిగే క్రీడలకు ఎంపికలు నిర్వహించడానికి విద్యార్థులను గ్రౌండ్‌కు పిలిచారు. తర్వాత ఒక్కొక్కరుగా తరగతి గదులకు చేరుకుంటున్నారు. థర్డ్‌ పీరియడ్‌ తెలుగు సబ్జెక్ట్‌ బోధించాల్సి ఉండగా.. క్లాస్‌ బోర్డుపై ఇంగ్లిష్‌ పాఠం అని రాశారు. దీన్ని డస్టర్‌తో తుడిచేందుకు భానుప్రకాశ్‌ స్నేహితుడు యత్నించాడు. ఇదే సమయంలో భానుప్రకాశ్‌.. అతడి నుంచి డస్టర్‌ తీసుకోబోయాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. భానుప్రకాశ్‌ను వారిస్తూ అతడి మెడపై బలంగా గుద్దాడు అతడి స్నేహితుడు. దీంతో భానుప్రకాశ్‌ విద్యార్థులు కూర్చునే బల్లపై పడిపోయాడు. మెడపై బలమైన దెబ్బ తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విద్యార్థులంతా గట్టిగా కేకలు వేయడంతో ఉపాధ్యాయులు క్లాస్‌రూంకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న భానుప్రకాశ్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.



జాతీయ రహదారిపై రాస్తారోకో

విద్యార్థి మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ విజయవాడ – జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై మృతుడి బంధువులు, వివిధ పార్టీల నేతలు, దళిత సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. నాలుగు గంటల పాటు ఆందోళన జరిపారు. భానుప్రకాశ్‌ మృతికి బాధ్యులను చేస్తూ ప్రధానోపాధ్యాయురాలు బీపీఆర్‌ఎల్‌ కుమారి, పీడీ సృజనలను సస్పెండ్‌ చేస్తున్నట్లు డీఈవో హయగ్రీవాచారి చెప్పారు. అనంతరం ఈ ఘటన విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుకు ఫోన్‌లో వివరించారు. భానుప్రకాశ్‌ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.



చనిపోతాడనుకోలేదు

‘‘నా చేతిలో ఉన్న డస్టర్‌ను భాను ప్రకాశ్‌ లాక్కోబోయాడు. నేను వారించినా మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. దీంతో కోపం వచ్చి కొట్టాను. చనిపోతాడనుకోలేదు.. నేను, భాను రోజూ ఇంటి నుంచి కలిసే బడికి వస్తాం. ఇలా జరుగుతుం దని అనుకోలేదు..’’అంటూ భానును కొట్టిన రెండో విద్యార్థి విలపించాడు. కాగా, అతడిపై పాఠశాల ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top