జాస్మిన్‌ మృతిపై వీడని మిస్టరీ

జాస్మిన్‌ మృతిపై వీడని మిస్టరీ

* పుష్కరాల ముసుగులో మరుగున పడిన కేసు

బయటకు రాని పోస్టుమార్టం రిపోర్టు 

ముందుకు సాగని విచారణ

 

రేపల్లె: నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామ పంచాయతీ పరిధి మహ్మదీయపాలెంలో తీవ్ర సంచలనం కలిగించిన  షేక్‌ జాస్మిన్, వేముల శ్రీసాయి మృతి కేసులు పుష్కరాల హోరులో మరుగున పడిపోయాయి. మహ్మదీయపాలెంలో జాస్మిన్‌ మృతి చెందిన సమయంలో ఆ ఇంట్లో ఉన్న గరువు గ్రామానికి చెందిన వేముల శ్రీసాయి, జొన్న పవన్‌కుమార్‌లను స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ సంఘటనలో ఆదే రోజు పోలీసుల స్వాధీనంలో ఉన్న శ్రీసాయిని ఆసుపత్రికి తరలిస్తుండగా మతి చెందాడు. జాస్మిన్, శ్రీసాయి మతి సంఘటనలను హత్య కేసులుగా పోలీసులు వేర్వేరుగా నమోదు చేశారు. శ్రీసాయి హత్యకేసులో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సంఘటన జరిగిన 10 రోజుల్లోనే 14 మందిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే జాస్మిన్‌ మతి కేసు మాత్రం అడుగు కూడా ముందుకు పడకపోవడంపై పోలీసుల తీరును పలువురు విమర్శిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ జాస్మిన్, శ్రీసాయిల మతి ఆ రెండు కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. ఈ పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ అడవులదీవి గ్రామంలోని శ్రీ సాయి కుటుంబాన్ని మాత్రమే పరామర్శించడం,  జాస్మిన్‌ కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై  విమర్శలు వెల్లువెత్తాయి. ఈ లోగా పుష్కరాల హడావుడి రావడంతో ఆ కేసుల విచారణ మరుగున పడిపోయింది. 

 

పోలీసులపై చర్యలెక్కడ...?

శ్రీసాయిని చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టమవుతోందని, దీనిపై వివరణ ఇవ్వాలని డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నోటీసులు జారీచేయడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శ్రీసాయి అతని స్నేహితుడు పవన్‌కుమార్‌లను చెట్టుకు కట్టేసి సుమారు 5 గంటలసేపు స్థానిక పోలీసుల సమక్షంలోనే కొడుతున్నా ప్రేక్షకపాత్ర వహించడంపై హెచ్‌ఆర్‌సీ మండిపడింది. దీంతో పాటు ప్రజాసంఘాలు సైతం శ్రీసాయి, పవన్‌లపై దాడిని ఖండించాయి. పోలీసుల సమక్షంలో జరిగిన ఈ సంఘటనకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని శ్రీసాయి కుటుంబ సభ్యులతో పాటు ప్రజాసంఘాలు గళమెత్తాయి. అయినా ఇప్పటివరకు సదరు పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్న స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా జాస్మిన్, శ్రీసాయి హత్యకేసులను పక్షపాతం లేకుండా విచారించి అసలైన దోషులను శిక్షించడంతో పాటు శ్రీసాయి మృతికి పరోక్షకారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top