అంబరాన్నంటేలా సంబరాలు

అంబరాన్నంటేలా సంబరాలు - Sakshi


►రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కసరత్తు షురూ !

జూన్‌ 2న పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకలు ప్రారంభం

ఏర్పాట్లకు అధికారులతో 14 కమిటీలు

జిల్లా ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌గా కలెక్టర్‌




ఇందూరు (నిజామాబాద్‌ అర్బన్‌) : జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో సంబరాలను జరుపనున్నారు. కలెక్టర్‌ యోగితారాణా సోమవారం ప్రగతిభవన్‌లో జిల్లా స్థాయి అధికారులతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై సమీక్షించారు. వేడుకల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సక్రమంగా నిర్వహించడానికి కలెక్టర్‌ అధికారులతో 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా జిల్లా స్థాయి ఆర్గనైజింగ్‌ కమిటీలో చైర్మన్‌గా కలెక్టర్‌ ఉండగా, పోలీసు కమిషనర్‌ కార్తికేయ, జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి,  ఇన్‌చార్జి డీఆర్వో రమేష్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఏడాది కంటే భారీగా వేడుకలను నిర్వహించాలని, ఇందుకుకోసం అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.



ఉదయం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఒంటరి మహిళలకు పింఛన్‌ల పంపిణీ, వివిధ శాఖల ఆస్తుల పంపిణీ, స్వాతంత్య్ర సమర యోధులకు సన్మానం, జిల్లా అభివృద్ధిపై ప్రజలనుద్దేశించి ప్రసంగం, జిల్లాలో 25 అంశాలలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ప్రశంసా పత్రాలు, సన్మానంతో పాటు నగదు పారితోషకం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత వివిధ కళారూపాలతో ప్రజలతో ర్యాలీ ఉంటుందన్నారు. కలెక్టరేట్‌ గ్రౌండ్‌లో సాయంత్రం ఆరు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ కమిటీ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.



ఆర్గనైజింగ్‌ కమిటీ చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌ రెడ్డి, ఫైర్‌ క్రాకర్స్‌ కమిటీ చైర్మన్‌గా కార్పొరేషన్‌ కమిషనర్‌ నాగేశ్వర్‌రావు, కల్చరల్‌ కమిటీ చైర్మన్‌గా డీఈవో రాజేష్, ఎగ్జిబిషన్, ర్యాలీ కమిటీలæ చైర్మన్‌గా డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, ఫుడ్‌ అకామిడేషన్‌ కమిటీ చైర్మన్‌ నిజామాబాద్‌ ఆర్‌డీవో వినోద్‌ కుమార్, పబ్లిసిటీ, మీడియా కమిటీ చైర్మన్‌గా సమాచార శాఖ డీడీ మహ్మద్‌ ముర్తుజా, సెమినార్‌ కమిటీ చైర్మన్‌గా గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపల్, సీట్లు, పండ్లు పంపిణీ కమిటీ చైర్మన్‌గా డీఆర్వో రమేష్, బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపు నిర్వహణ చైర్మన్‌గా డీఎంఅండ్‌హెచ్‌వో, అమర వీరుల స్థూపం వద్ద అలంకరణ చైర్మన్‌గా నగర కమిషనర్, అవార్డుల చైర్మన్‌గా సీపీవోను నియమించినట్లు తెలిపారు. ఈ కమిటీల చైర్మన్‌లు వారి కమిటీ సభ్యులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించుకోవాలన్నారు. వేడుకలకు అన్ని కుల సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులను ఆహ్వానించాలన్నారు. పట్టణంలోని ఆయా కూడళ్లలో విద్యుత్తు దీపాల అలంకరణ చేపట్టాలని నగర కమిషనర్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జేసీ రవీందర్‌ రెడ్డి, డీఆర్వో రమేష్, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు,  అధికారులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top