ప్రజారంజక పాలనకు సహకరించండి

ప్రజారంజక పాలనకు సహకరించండి


చిలకలపూడి(మచిలీపట్నం) : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అందిస్తున్న ప్రజారంజక పాలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ అన్నారు. జిల్లాపరిషత్‌ సమావేశపు హాలులో మంగళవారం స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ  జన్మభూమి, మాఊరు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, డిజిటల్‌ క్లాసులు ఏర్పాటులో విద్యాశాఖాధికారులు ముందుకు రావాలన్నారు.

-ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లాలో చాలా వరకు పీహెచ్‌సీ భవనాలు అధ్వాన్నస్థితిలో ఉన్నాయని, ఆసుపత్రి ఆవరణ పిచ్చిమొక్కలతో నిండి ఉన్నాయని పలు మండలాల్లో ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలల్లో సైకిల్‌స్టాండ్‌లు, కిచెన్‌షెడ్లు ఏర్పాటు చేయాలని పలు మండలాల జెడ్పీటీసీలు డీఈవో దృష్టికి తీసుకువచ్చారు. తిరువూరు మండలంలోని అన్ని జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో కూడా ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీ సభ్యురాలు కిలారు విజయబిందు కోరారు. గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘ సమావేశంలో డీఆర్డీఏ పీడీ డి.చంద్రశేఖరరాజు జిల్లాలో ఇప్పటి వరకు 3.30 లక్షలు మందికి రూ.36 కోట్లు పింఛన్లుగా అందజేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి రూ.2వేలు చొప్పున 32వేల కొత్త పింఛన్లు మంజూరు చేశారన్నారు. ఇప్పటి వరకు 44,039 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. 32వేల మందికి మంజూరు చేస్తూ ఇటీవల జీవో విడుదల చేశారన్నారు. మిగిలిన వారికి పింఛనుదారులు మరణించిన వారి స్థానంలో కొత్త వారికి అందజేస్తారన్నారు.

అవార్డులు మీకు రివార్డులు మాకా!

నగదు రహిత లావాదేవీల అంశం, బ్యాంక్‌ కరస్పాండెంట్ల చెల్లింపుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు దొండపాటి రాము అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీలు బాగా జరిగాయని అవార్డులు తీసుకుంటుంటే ప్రజాప్రతినిధులకు మాత్రం ప్రజల నుంచి రివార్డులు అందుతున్నాయన్నారు. నగదు రహిత లావాదేవీల అంశంలో కొన్ని మార్పులు చేసి ప్రజల కష్టాలను తీర్చాలని ఆయన కోరారు. అనంతరం వైస్‌చైర్మన్‌ శాయన పుష్పావతి అధ్యక్షతన వ్యవసాయం స్థాయి సంఘ సమావేశం, బంటుమిల్లి జెడ్పీటీసీ దాసరి కరుణజ్యోతి అధ్యక్షతన సాంఘిక సంక్షేమం, పామర్రు జెడ్పీటీసీ సభ్యురాలు పొట్లూరి శశి అధ్యక్షతన స్త్రీ, శిశుసంక్షేమ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. సమావేశాల్లో జెడ్పీ సీఈవో టి దామోదరనాయుడు, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top