కొత్త ఠాణాలను వేధిస్తోన్న కొరత

కొత్త ఠాణాలను వేధిస్తోన్న కొరత - Sakshi


► నాలుగు పీఎస్‌లల్లో సిబ్బంది అంతంతే

► నిర్వహణ ఖర్చులకు డబ్బులు కరువు

► నిధులు విడుదల చేయని ప్రభుత్వం

► సమస్యల వలయంలో స్టేషన్లు




రామారెడ్డి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో గతేడాది అక్టోబర్‌ 11న కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. కామారెడ్డిని కొత్త జిల్లాగా, రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్, బీబీపేటలను కొత్తగా ఐదు మండలాలుగా ఏర్పాటు చేసింది.


అయితే వీటిల్లో తాత్కాలిక భవనాలల్లో రెవెన్యూ, పోలీసు స్టేషన్లను ప్రారంభించారు. నేరాల నియంత్రణకు శాంతి భద్రతలను కోసం ఏర్పాటు చేసిన పోలీసుస్టేషన్‌ కనీస సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా విధులు నిర్వహించేందుకు పాత వాహనాలనే కేటయించారు. దీంతో అవి పదే పదే మొరాయిస్తున్నాయి. ఈ కారణంగా ఎస్‌ఐలతో సహా సిబ్బంది రాత్రి గస్తీకి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 323 గ్రామ పంచాయతీలు, 9లక్షల72వేల 625 జనాభాతో కామారెడ్డిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు.



ఎఫ్‌ కేటగిరిలో స్టేషన్ల ఏర్పాటు..

పోలీసుశాఖ పరంగా గ్రామీణ ప్రాంత పోలీసు స్టేషన్‌లు ఎఫ్‌ కేటగిరిలోకి వస్తాయి. జిల్లాలోని రామారెడ్డి, రాజంపేట, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్‌ పోలీసు స్టేషన్‌లకు 1 ఎస్‌ఐ, 2 ఏఎస్‌ఐలు, 3 హెడ్‌ కానిస్టేబుళ్లు, 18 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. అయితే రామారెడ్డి పోలీసు స్టేషన్‌లో 1ఎస్‌ఐ 2హెడ్‌ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. మిగితా మూడు స్టేషన్లలో ఏఎస్‌ఐ ఉన్నా పూర్తిస్థాయిలో  సిబ్బందిని కేటాయించలేదు. దీంతో వీఐపీల పర్యటనలకు బందోబస్తు కల్పించడం, నేరాల నియంత్రణకు రా త్రి గస్తీ నిర్వహించడం, స్టేషన్‌లో ఫిర్యాదులను స్వీకరించి  విచారణకు తీసుకురావడం వంటి పనులు ఉన్న సిబ్బందికి కత్తి మీద సాములా తయ్యారైంది.



నిర్వహణ భారంతో ఒత్తిడి..

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్‌ పోలీసుస్టేషన్ల నిర్వహణ కోసం వివిధ కేటగిరీల ఆధారంగా రూ.25వేల నుంచి రూ.75 వేల వరకు నిర్వహణ కోసం ప్రతి నెలా డబ్బులను పోలీసు స్టేషన్లకు కేటాయిస్తున్నారు. అయితే కొత్తగా ఏర్పాటైన నాలుగు స్టేషన్లకు 8నెలలు గడుస్తున్నా డబ్బులను మంజూరు చేయలేదు. కొత్త స్టేషన్లలో ఎస్‌ఐలు నిర్వహణ భారంతో మరింత ఒత్తిడికి గురవుతున్నారు.



మెరాయిస్తున్న పాత వాహనాలు..

రాత్రిపూట జిల్లాలోని 323 జీపీల పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహించడం గ్రామాల్లో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే అక్కడికి చేరుకొని పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకోడం కోసం వేగంగా ఘటన స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొత్త పోలీసుస్టేషన్లకు రెండు నెలల క్రిత్రం పాత  వాహనాలనే కేటాయించారు. అయితే ఈ వాహనాలు పదే పదే మెరాయిస్తున్నాయి. దీంతో బైకులపై పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వాహనాలతో ఇబ్బంది, సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో పెట్రోలింగ్‌ నిర్వహించడం ప్రతి జీపీకి పోలీసు అధికారిని నియమించడం సాధ్యం కావడం లేదు.



ప్రజలకు చేరువయ్యేదెలా..?

పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే కొత్తగా ఏర్పాటైన మండల కార్యాలయాలకు పోలీసు స్టేషన్‌లకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జిల్లా, మండలాలు ఏర్పాడి 8 నెలలు పూర్తి అయినా ప్రభుత్వం కనీసం పోలీసు స్టేషన్‌కు కొత్త వాహనం, సిబ్బందిని కేటాయించకపోతే ఎలా విధులు నిర్వహిస్తారని ప్రజలు ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top