ఎస్పీఎంలో భారీ అగ్నిప్రమాదం

ఎస్పీఎంలో భారీ అగ్నిప్రమాదం


పవర్‌ప్లాంట్‌లో చెలరేగిన మంటలు

యుద్ధప్రాతిపాదికన సహాయక చర్యలు

దగ్ధమైన విద్యుత్‌ బ్రేకర్లు

కోటి రూపాయల నష్టం


కాగజ్‌నగర్‌: కుమురం భీం జిల్లా సిర్పూర్‌కాగజ్‌నగర్‌ పట్టణంలోని మూతబడిన సిర్పూర్‌ పేపర్‌ మిల్లు (ఎస్‌పీఎం)లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేప ర్‌ మిల్లులోని అన్ని విభాగాలతో పాటు కార్మికులు నివాసముండే అన్ని క్వార్టర్లకు విద్యుత్‌ సరఫరా చేసే పవర్‌ప్లాంట్‌లో మంటలు చెలరేగాయి.



సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని పోలీస్‌ అధికారులకు తెలియజేశారు. డీఎస్పీ ఎండీ.హబీబ్‌ఖాన్, పట్టణ సీఐ సిహెచ్‌.నాగేందర్, రూరల్‌ సీఐ రమేష్‌బాబు, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అగ్నిమాపక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు పవర్‌ప్లాంట్‌కు చేరుకొని మంటలను ఆర్పివేసే ప్రయత్నాలు చేశారు. పవర్‌ప్లాంట్‌లోని మొ దటి అంతస్తులో ఉన్న టర్బైన్‌ నెంబర్‌–1, 2లో ఎలక్ట్రికల్‌ మొయిన్‌ బ్రేకర్లు ఉండటం, అందులో ఆయిల్‌ ఉన్నందున షార్ట్‌ సర్క్యూట్‌తో ఈ ప్రమాదంలో జరి గినట్లు పేర్కొంటున్నారు.



టర్బైన్‌లోని ఎలక్ట్రికల్‌ మెయిన్‌ బ్రేకర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు కోటి రూపాయల విలువ గల సామగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ ఫైర్‌స్టేషన్లకు చెందిన మూడు అగ్ని మాపక వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటీకి బ్రేకర్లలో ఆయిల్‌ లీకై మంటలు అదుపులో రాలేదు. దీంతో ఫోం అనే రసాయనం సహా యంతో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు మంటలను అదుపు చేశారు. ఈ నెల 9వ తేదీన సైతం సర్దార్‌ బస్తీకి ఆనుకొని ఉన్న ఎస్పీఎం సబ్‌స్టేషన్‌ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించి సానిటేషన్‌ సామగ్రి కాలిపోగా, సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే.



తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో సెక్యూరిటీ సి బ్బంది నిర్లక్ష్యం బహిర్గతమవుతోందని పలువురు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఐడీబీ ఐ ఆధీనంలో ఉన్న సిర్పూర్‌ పేపర్‌ మిల్లు ఆస్తులను సంరక్షించడానికి ప్రైవేట్‌ సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నా రు. అయితే వారు కేవలం ఆస్తుల పరిరక్షణకే పరిమితమవుతున్నారని, లోపల విభాగాలపై నిఘా పెట్టడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఎస్‌పీఎం డీజీఎం రమేష్‌రావును సంప్రదించగా, పవర్‌ప్లాంట్‌లో విలువైన ఎలక్ట్రికల్‌ బ్రేకర్లు దగ్ధమవడంతో సుమారు రూ.కోటి నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top