ప్యాకేజీలు కాదు.. హోదా కావాలి

ప్యాకేజీలు కాదు.. హోదా కావాలి - Sakshi

– ఏపీయూడబ్ల్యూజే అవగాహన సదస్సులో వక్తలు  

 

విజయవాడ (గాంధీనగర్‌) :

 విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ప్యాకేజీలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ప్రత్యేక హోదా కావాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. హోదా వస్తేనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యాన ‘ప్రత్యేక హోదా’పై అవగాహన సదస్సు బుధవారం జరిగింది. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కమీషన్లకు ఆశపడే సీఎం చంద్రబాబు ప్యాకేజీ ఇస్తామనగానే చంకలు గుద్దుకుంటున్నారన్నారు. హోదా తెస్తామని ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టిన చంద్రబాబు ప్యాకేజీ పేరుతో ప్రజల చెవులో పూలు పెడితే అంగీకరించాలా..? అని నిలదీశారు. హోదా వల్లే ఉత్తరాఖండ్‌ అభివృద్ధి చెందిందని నాడు పార్లమెంట్‌లో ప్రభుత్వం చేసిన ప్రకటనను కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజానచౌదరి గుర్తించాలని హితవుపలికారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. నాగార్జున యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్‌ సి.నరసింహారావు మాట్లాడుతూ హోదాకు, ప్యాకేజీకి ఎంతో తేడా ఉందన్నారు. స్టెల్లా కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డాక్టర్‌ రెజీనా మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. మేధోవలసలను అరికట్టాలంటే పరిశ్రమలు రావాలన్నారు. ఇందుకు ప్రత్యేక హోదానే శరణ్యమని పేర్కొన్నారు. 

  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top