బతికితేనే భవిత !

బతికితేనే భవిత ! - Sakshi


హరితహారం లక్ష్యం

నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

ఉపాధి హామీ నిధులు వెచ్చించాలని ప్రభుత్వ నిర్ణయం

తాగునీటి మాదిరిగా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా

ట్రిప్పుకు రూ.480, ఉపాధి కూలీకి రూ.150 చెల్లింపు

ఈ ఏడాది జిల్లాలో 1.83 కోట్ల మొక్కలు..

మొక్కలకు కంచెగా సర్కారు తుమ్మ ఏర్పాటు

చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం

గతేడాది 50 శాతం కూడా బతకలేదు




నిజామాబాద్‌ : నాటిన మొక్కలు ఏనుకుంటేనే.. ‘హరితహారం’ లక్ష్యం నెరవేరుతుంది. లక్షల్లో మొక్కలు నాటడం.. ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి ఎండిపోవడం సాధారణంగా జరుగుతున్న తంతు.. జిల్లాలో కమ్యూనిటీ ప్లాంటేషన్, బ్లాక్‌ ప్లాంటేషన్‌ కింద నాటిన మొక్కల్లో కనీసం 50 శాతం కూడా బతకలేదు. ఈ సమస్యను అధిగమించే చర్యలపై జిల్లా అధికార యంత్రాగం ఈ ఏడాది దృష్టి సారించింది. ఈసారి నాటిన ప్రతి మొక్కను రక్షించుకునేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. వంద శాతం బతికించుకునేందుకు (సర్వైవల్‌) కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఉపాధి హామీ నిధులను వినియోగించుకోవాలని భావిస్తోంది. వర్షాకాలం తర్వాత మొక్కలు బతకాలంటే కనీసం వారానికి ఒకసారైనా నీళ్లు అవసరం ఉంటుంది. తాగునీటి కోసం మాదిరిగానే ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీటిని పోసేందుకు ముందస్తు ప్రణాళికను సిద్ధం చేస్తోంది.



ఆయా గ్రామాల్లో 400 మొక్కలకు ట్యాంకర్‌ ద్వారా నీళ్లు పోస్తే ఒక్కో ట్రిప్పుకు రూ.480 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. అలాగే నీళ్లు పోసిన వారికి ఉపాధి హామీ కింద రోజుకు రూ.150 వరకు కూలీ డబ్బులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది ఈ విధానం అమలులో ఉన్నప్పటికీ ఆశించిన మేర కు చర్యలు చేపట్టలేదు. చాలా చోట్ల మొక్కలు ఎండిపోయాయి. దీంతో రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన హరితహారం కార్యక్రమం అనుకున్న మేర కు లక్ష్యాన్ని చేరలేకపోయింది. గత ఏడాది ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో 3.61 కోట్ల మొక్కలు నాటారు. నిజామాబాద్‌ పరి« దిలో సుమా రు 1.92 కోట్ల మొక్కలు పెట్టినట్లు అటవీశాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. ఇందులో సుమారు 69 శాతం మొక్కలు బతి కినట్లు ఆ శాఖ రికార్డుల్లో పేర్కొన్నారు. కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన మొక్కలు 60 శాతం మాత్రమే బతికాయని భావిస్తున్నారు. అలాగే బ్లాక్‌ ప్లాంటేషన్‌ మొక్కల సర్వైవల్‌ కూడా అంతే ఉంది. మొత్తం మీద సగటున 69 శాతం మొక్కలు బతికినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు.



అవగాహనపై దృష్టి..

ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1.83 కోట్ల మొక్కల నాటాలని జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. నాటిన మొక్కలను కాపాడుకునేందుకు ఉచితంగా పనిచేయాల్సిన అవసరం లేదని, ప్రతి పనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టే అంశాన్ని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. నాటిన మొక్కలను పశువులు మేయకుండా రక్షించుకునేందుకు సర్కారు తుమ్మను కంచెగా నాటాలని భావిస్తున్నారు. హరితహారం కార్యక్రమం ప్రారంభం కాకముందే గ్రామాల్లో తుమ్మ కంపను అందుబాటులో ఉంచేందుకు ఉపాధి హామీ మేట్‌లు, కూలీలను సమాయత్తం చేయాలని నిర్ణయించారు.



సంరక్షణ చర్యలపై దృష్టి పెట్టాం

హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాము. ఇందుకోసం ముందస్తుగా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఉపాధిహామీ పథకం కింద ఈ సంరక్షణ చర్యలు చేపట్టే అంశంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని భావిస్తున్నాము.– ప్రసాద్, జిల్లా అటవీశాఖాధికారి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top