దసరాకు ప్రత్యేక బస్సులు

దసరాకు ప్రత్యేక బస్సులు


 


  •  3,855 బస్సులు నడిపేందుకు ప్రత్యేక చర్యలు

  • 200 కిలోమీటర్లు దాటితే 50 శాతం అదనపు చార్జీలు

  • వెల్లడించిన ఆర్టీసీ ఆర్‌ఎం గంగాధర్


 సాక్షి, హైదరాబాద్: దసరా పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే  ప్రయాణికుల కోసం ఆర్టీసీ 3,855 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి రోజు నడిచే 3,500 రెగ్యులర్ బస్సులకు ఇవి అదనం. హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు తీసుకుంటారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ ఆర్.గంగాధర్ తెలిపారు. బస్సుల సమర్థ నిర్వహణ కోసం మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు, వివిధ ప్రాంతాల్లోని బస్టాండ్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు  శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రధాన బస్‌స్టేషన్‌ల నుంచే కాకుండా అధీకృత టిక్కెట్ బుకింగ్ కేంద్రాల నుంచి కూడా బస్సులు నడుపుతారు. ఈసీఐఎల్, ఏఎస్‌రావునగర్, కేపీహెచ్‌బీ, మియాపూర్, అమీర్‌పేట్, తదితర ప్రాంతాల్లోని అధీకృత టిక్కెట్ బుకింగ్ కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి.

 బస్సుల నిలుపుదలలో మార్పులు..

 పండుగ రద్దీ దృష్ట్యా ఈ నెల 17వ తేదీ నుంచి 21 వరకు వివిధ రూట్లలో రాకపోకలు సాగించే బస్సుల హాల్టింగ్ కేంద్రాల్లో మార్పులు, చేర్పులు చేశారు.

ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, పరిగి, వికారాబాద్, తాండూర్ వైపు వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ వరకు వస్తాయి.

వెన్నెల, గరుడ, గరుడ ప్లస్, కర్ణాటక, మహారాష్ట్ర, విజయవాడ, గుంటూరు వైపు వెళ్లే రెగ్యులర్ బస్సులు కూడా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ వరకు వస్తాయి.

విజయవాడ, గుంటూరుకు వెళ్లే స్పెషల్ బస్సులను ఎల్‌బీనగర్ వరకు నడుపుతారు.

కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ బస్సులు జూబ్లీ బస్‌స్టేషన్, పికెట్ వరకు నడుస్తాయి.

కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ నుంచి నడుపుతారు.

వరంగల్ వైపు వెళ్లే బస్సులు కాచిగూడ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరి ఉప్పల్ క్రాస్‌రోడ్స్ మీదుగా వెళ్తాయి. యాదగిరిగుట్ట బస్సులను ఉప్పల్ నుంచి నడుపుతారు.

 ప్రతి 15 నిమిషాలకో సిటీ బస్సు..

మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక సిటీ బస్సు అందుబాటులో ఉంటుంది.

ఎంజీబీఎస్ నుంచి జూబ్లీ బస్‌స్టేషన్‌కు వెళ్లే సిటీ బస్సులు ప్లాట్‌ఫామ్ 51 నుంచి 55 వరకు ఆగుతాయి. కాచిగూడ, ఉప్పల్ వైపు వెళ్లే బస్సులను ప్లాట్‌ఫామ్ 41-46 మధ్య నిలుపుతారు.

ఎల్‌బీనగర్‌కు వెళ్లే బస్సులు 15వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరుతాయి.

 బస్సుల వివరాల కోసం ప్రయాణికులు  సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు

 తెలంగాణ ఆర్టీసీ:

 040-24614406 (ఎంజీబీఎస్)

 040-27802203 (జేబీఎస్)

 సీనియర్ కస్టమర్ రిలేషన్స్ మేనేజర్:

 9959226126

 ఏపీఎస్ ఆర్టీసీ: డిప్యూటీ సీటీఎం - 9100948675, 9100948191

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top