అనుమతిలేని కార్యక్రమాలను అడ్డుకుంటాం

అనుమతిలేని కార్యక్రమాలను అడ్డుకుంటాం

ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చర్యలు   

జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ 

కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : పోలీసుల నుంచి ముందస్తు అనుమతిలేకుండా నిర్వహించే కార్యక్రమాలను శాంతి భద్రతల రీత్యా అడ్డుకుంటామని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్‌ స్పష్టం చేశారు. శనివారం సర్పవరం పోలీసు అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  సున్నిత అంశాలపై జిల్లాలో 1994, 1998, 2016 సంవత్సరాల్లో చోటుచేసుకున్న పలు హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా సెక్షన్‌ 30 అమల్లో పెట్టినట్లు తెలిపారు. దీని ప్రకారం అన్ని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎటువంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదని స్పష్టం చేశారు. సున్నిత అంశాలపై ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహించరాదని, ఇందుకు అన్ని రాజకీయపార్టీలు, నేతలు సహకరించాలని కోరారు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుత వాతావరణంలో చేసుకునే కార్యక్రమాలకు పోలీసుల సహకారం ఉంటుందన్నారు. తొండంగిలో నిర్మించనున్న దివీస్‌ కర్మాగార స్థాపనకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనను అడ్డుకోగా, కోర్టు ఉత్తర్వులతో సీపీఎం నేతలను అక్కడకు అనుమతించామన్నారు. ఈ నెల 25 నుంచి కాపు జేఏసీ ఆధ్వర్యంలో రావులపాలెం నుంచి అంతర్వేది దాకా ముద్రగడ పద్మనాభం చేపట్టనున్న పాదయాత్రకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. అనుమతి కోసం దరఖాస్తు రాలేదని, వస్తే పరిశీలిస్తామన్నారు. ఈనెల 28 నుంచి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ నుంచి అమలాపురం దాకా బైక్‌ర్యాలీ నిర్వహిస్తామని, ఇం దుకు అనుమతి కోరుతూ దరఖాస్తు వచ్చిందన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. కోర్టుల నుంచి అనుమతులు తీసుకువస్తే, ఆమోదయోగ్యం గా చట్టానికి లోబడి నిర్వహించే కార్యక్రమాలకు అనుమతి ఇస్తామ న్నారు. ఇది అన్ని రాజకీయపార్టీలకు వర్తిస్తుందన్నారు. తునిలో జరిగిన కాపు గర్జనకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, అక్క డ అనుకోకుండా అరాచకశక్తులు చొరబడడంతో హింసాత్మక సంఘటన చోటుచేసుకున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ప్రశాంతవరణం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డీఎస్‌బీ డీఎస్పీ విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top