ఇదో కమర్షియల్ ప్రపంచం..

ఇదో కమర్షియల్ ప్రపంచం..


రాజమహేంద్రవరం :‘భావవ్యక్తీకరణకు అక్షరం సాధనం. సినిమా పాటలకైనా, సాంప్రదాయ సంగీతానికైనా సాహిత్యం చాలా ముఖ్యం’ విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం జరిగే ఘంటసాల స్వరార్చన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఆయన.. శుక్రవారం రాత్రి బస చేసిన హోటల్లో ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

 

బాపు, రమణల ‘బంగారుపిచిక’లో నన్ను నటించమంటే వద్దన్నాను. గాయకుడిగా నిలదొక్కుకోవడమే నా ప్రాధాన్యత. తరువాత కాలంలో నేను కొన్ని సినిమాల్లో నటించిన మాట వాస్తవమే. నటన, సంగీతం ఏది ముఖ్యమని కొందరు అడుగుతూంటారు. ఏదైనా ఇష్టపడితేనే చేస్తాను. ‘మిథునం’ నాకు నచ్చిన సినిమా. నేటి సినిమాల్లో మంచి పాటలు రావడం లేదా అంటే- చెట్టుముందా, విత్తు ముందా అన్న ప్రశ్న లాంటిది. నేను రెండు సంవత్సరాల నుంచి సినిమాలు చూడటం లేదు.

 

ఇదో కమర్షియల్ ప్రపంచం..

ఇప్పటి సినిమాల్లో పాటలకు జనం కేరింతలు కొడుతున్నారని నిర్మాతలు చెబుతున్నారు. భాషరాని వారు పాటలు పాడుతున్నారు, జనం చూస్తున్నారు. ఉచ్చారణ ఎవరికి కావాలి? నేటి పరిస్థితికి ఎవరినీ నిందించలేము. కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు సినిమాలు ఎందుకులేవు? ‘మిథునం’ ఎందుకు వంద రోజులు ఆడలేదు? ఈ సినిమా విడుదలకు థియేటర్లు దొరకడం కష్టమైంది.

 

ఇదో కమర్షియల్ ప్రపంచం. మంచీ చెడూ అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. సినిమాలను కేవలం ఒక వినోదప్రక్రియగా చూస్తే గొడవ లేదు. మనం ఏమీ మార్చలేం. ప్రస్తుతం నాకు నచ్చితే పాడుతున్నాను. కుక్క ఎటు వెడితే మంచిది అంటే, మనల్ని కరవకుండా ఎటు వెళ్ళినా మంచిదే అనుకోవాలి. మన పని మనం చూసుకోవడమే. జీవితంలో సినిమా ఒక అంశం మాత్రమే. సినిమాయే ప్రపంచం కాదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top