కొందరి వల్ల డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు

కొందరి వల్ల డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు - Sakshi


ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి దూరంగా ఉండాలి  

అంకిత భావంతో పనిచేయాలి

ఏసీబీ పనితీరు అమోఘం  కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌




బీచ్‌రోడ్‌ : ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి నీతి, నిజాయితీ, అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్‌లో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు, రెవెన్యూ శాఖా సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లా, మండల కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. కొంత మంది అధికారులు, సిబ్బంది చేస్తున్న పనుల వల్ల డిపార్ట్‌మెంట్‌ మొత్తానికి  చెడ్డపేరు వస్తోందన్నారు. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారులకు వచ్చిన జీతం చాలకపోతే ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.



ప్రజలకు నమ్మకం పోతోంది..

అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. అవినీతిపై మండల స్థాయిలో ఎప్పటికప్పడు సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తుండాలన్నారు. అమాయకులకు అన్యాయం జరిగితే సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కొంతమంది సిబ్బంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పరిష్కారం దొరక్క వారు బాధితులవుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల డిపార్ట్‌మెంట్‌పై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. కార్యాలయంతో సంబంధం లేని బయట వ్యక్తులను లోనికి అనుమతించరాదని ఆదేశించారు. సిబ్బంది వారి జాబ్‌ చార్ట్‌ ప్రకారం, రూల్స్‌ను అతిక్రమించకుండా క్రమశిక్షణతో పారదర్శకంగా పనిచేయాలన్నారు. అవినీతి నిర్మూలనలో ఏసీబీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌–2 డి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ డైరీ ఆవిష్కరణ జిల్లా రెవెన్యూ అసోషియేషన్‌ ప్రచురించిన 2017 నూతన డైరీని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, జాయింట్‌ కలెక్టర్‌–2 డి.వెంకరెడ్డి ఆవిష్కరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top