యూనివర్శిటీల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి


-తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది సంఘం

పంజగుట్ట(హైదరాబాద్ సిటీ)


 ముఖ్యమంత్రి కెసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించడం సంతోషకరమని అదే సమయంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరించాలని తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది సంఘం డిమాండ్ చేసింది. ఎంతో మంది పేదలకు విద్య అందిస్తున్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని విశ్వవిద్యాలయాలకు బ్లాక్‌గ్రాంట్‌ని పెంచి నిధులను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


 


సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల భోధనేతర సిబ్బంది సంఘం అధ్యక్షులు కంచి మనోహర్, సెక్రటరీ జనరల్ కె.మహిపాల్ రెడ్డిలు మాట్లాడుతూ ... ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రతీ నెలా జీతాలు, ఖర్చులకు 33 కోట్ల 50 లక్షలు అవసరం కాగా ప్రభుత్వం కేవలం 19 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారని, వచ్చే నెల జీతాలు వస్తాయో లేదో అన్న అనుమానం ఉందని పేర్కొన్నారు. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు పిఎఫ్ కూడా ఇవ్వడంలేదని ఆవేదనవ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండడం బాధాకరమని అన్నారు.


 


ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి తమకు కూడా ట్రెజరీద్వారా ప్రతీ నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలన్నారు. ప్రతీ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తున్న 238 కోట్ల బ్లాక్‌గ్రాంట్‌ను మరో 170 కోట్లు కలిపి త్వరగా నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి తమకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు వెంటనే పెన్షన్, పెన్షనరీ బెనిఫిట్స్‌ను చెల్లించాలని, టైమ్‌స్కేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మెనెంట్ చేయాలని, భోధనేతర సిబ్బంది లేని యూనివర్సిటీల్లో వెంటనే నియామకాలు చేపట్టాని డిమాండ్ చేశారు.


 


తమ సమస్యలపై త్వరలో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రం ఇస్తామని, అప్పటికీ పరిష్కారం కాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జ్ఞానేశ్వర్, నాగభూషనం, శంకర్, ఖదీర్, రాజశేఖర్ రెడ్డి, వినోద్‌కుమార్, రుక్కయ్య, వెంకటేష్, రాము, విజయ్‌కుమార్, నాగభూషనం తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top