ప్రజా సమస్యలను పరిష్కరించండి

ప్రజా సమస్యలను పరిష్కరించండి - Sakshi

–జిల్లా కలెక్టర్‌ను కోరిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు

 

కర్నూలు(అగ్రికల్చర్‌): ‘‘ పూర్వ జిల్లా కలెక్టర్‌ హయాంలో ప్రతి చోట అన్యాయం జరిగింది... చివరికి కలెక్టర్‌ సమావేశ మందిరంలో నీటి సమస్యపై ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశానికి కేవలం టీడీపీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌చార్జీలను మాత్రమే పిలిచి మమ్మల్ని పిలువ లేదు.. కొత్త కలెక్టర్‌గా మీరు వచ్చారు... చార్జీ తీసుకున్నట్లు ఫోన్‌ చేసి చెప్పారు సంతోషం.. ఇప్పటి నుంచైనా మేము తీసుకువచ్చే ప్రజా సమస్యలను పరిష్కరించండి’’ అంటూ జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.త్యనారాయణను కోరారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, డోన్, ఆదోని, పాణ్యం, నందికోట్కూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, సాయి ప్రసాద్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, బాలనాగిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నేత కొత్తకోట ప్రకాశ్‌రెడ్డిలు కలెక్టర్‌ను ఆయన చాంబరులో కలిశారు. ఈ సందర్భఃగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కలెక్టర్‌కు మంత్రాలయం రాఘవేంద్రస్వామి చిత్రపటం, ప్రసాదం అందచేశారు. జిల్లా అంతటా నీటి సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు అల్లాడుతున్నా పూర్వ కలెక్టర్‌ తమను పిలువ కుండానే టీడీపీ ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు.  కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ స్పందిస్తూ అందరూ కలసి వచ్చారు సంతోషం అంటూ.. తాను చేయగలిగిందంతా చేస్తానని స్పష్టం చేశారు. డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధరెడ్డి మాట్లాడుతూ... బేతంచెర్లలో రక్షిత మంచి నీటి పథకం బోరు నీటిని టీడీపీ నేతలు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.  

 

రాష్ట్రంలో నియంత పాలన... 

రాష్ట్రంలో నియంతపాలన నడుస్తోందని పీఏసీ చైర్మన్, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆరోపించారు. కలెక్టర్‌ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.  చంద్రబాబు పాలనలో సర్పంచ్, ఎంపీపీ, ఎమ్మెల్యే, ఎంపీలకు అధికారాలు లేవని,  జన్మభూమి కమిటీలు, టీడీపీ ఇన్‌చార్జీలకు మాత్రమే అధికారాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. పోలీసు అధికారులు సైతం జన్మభూమి కమిటీలకే విలువ ఇస్తున్నారన్నారు. పింఛన్, రేషన్‌ కార్డు,  పక్కా గృహం..ఎటువంటి ప్రయోజనం పొందాలన్నా జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top