4జి..క్రేజీ

4జి..క్రేజీ - Sakshi


సోషల్‌ మీడియాలో  ప్రేమ, మోసాలపై  సినిమా

డైరెక్టర్‌  గాజువాక కుర్రాడు   శ్రీనివాస్‌ కరణం

మేలో విడుదల




గాజువాక : ప్రేమ, కామం, విశ్వసనీయం (లవ్, లస్ట్, ట్రస్ట్‌).. సోషల్‌ మీడియా ప్రస్తుతం ఈ పదాల చుట్టూ తిరుగుతోంది. పరిచయంలేని వ్యక్తులమధ్య ప్రేమ. ఆ పేరుతో నయవంఛన. విశ్వసనీయతలేని చర్యతో నేరాల ఊబి. అందమైన జీవితం కకావికలం. ఈ అంశాలే ఇతి వృత్తంగా చేసుకొని సినిమాగా మార్చాడు గాజువాకకు చెందిన శ్రీనివాస్‌ కరణం. సోషల్‌ మీడియాలో చోటు చేసుకొంటున్న ఇలాంటి మోసాలకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడించి ‘4జీ’ టైటిల్‌తో తెరకెక్కించాడు.



సినీ పరిశ్రమలో అటు నటనలోను, ఇటు డైరెక్షన్‌లోను ఇప్పుడిప్పుడే ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకొంటున్న గాజువాకనుంచి ఇప్పుడు మరో దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. తన సినిమా, కెరియర్‌లపై సాక్షితో ముచ్చటించాడు. గాజువాకలోనే పుట్టి పెరిగాను. ఇంజినీరింగ్‌ చదువుకున్న నేను సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌ వెళ్లిపోయాను.. అని పేర్కొన్నాడు. ఇంకా తన సినిమా విషయాలను ఇలా చెప్పుకొచ్చాడు.



4జీ.. ఒక అద్భుతమైన కథ

4జీ కథ చాలా అద్భుతమైనది. వినూత్నమైంది. సోషల్‌ మీడియాలో పరిచయం లేని వ్యక్తులు ప్రేమ పేరుతో యువతులను ట్రాప్‌ చేయడం, వారిని అన్ని రకాలుగా నాశనం చేయడం. ఈ క్రమంలో సోషల్‌ మీడియాను ఎలా దుర్వినియోగం చేస్తున్నారన్నదే నా పాయింట్‌. పలు ప్రాంతాల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ కథను తెరకెక్కించాను. ఇందులో యూత్‌ను ఎంటర్‌టైన్‌ చేసే విధంగా ఎన్నో కమర్షియల్‌ ఎలిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాం. యూత్‌ కామెడీ చాలా ఆకట్టుకుంటుంది.



ఇది నా తొలి సినిమా

డైరెక్టర్‌గా 4జీ తొలి సినిమా. డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌రెడ్డివద్ద రొమాంటిక్‌ క్రైమ్‌ కథకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశా. అప్పట్నుంచి నా కెరియర్‌ మొదలైంది. అంతకుముందు వెయిటింగ్‌ ఫర్‌ యు సినిమాకు చేశాను. నేనేం చిన్న పిల్లనా సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ నేనే చేశా. ఆ తరువాత డైరెక్టర్‌ మాదాల కోటేశ్వరరావు వద్ద గులాబీ అనే సినిమాకు పని చేశా. ఈ క్రమంలో నేను రాసుకున్న 4జీ కథ నా మిత్రుడు ఉదయ్‌కుమార్‌కు నచ్చడంతో వాళ్ల మామయ్య వినోద్‌ కుమార్‌ను పరిచయం చేశారు. ఆయన ముందుకు రావడంతో సినిమా షూటింగ్‌ ప్రారంభించాం. దీనికి నా క్లాస్‌మేట్‌ లక్కరాజు రామారావు కో ప్రోడ్యూసర్‌గా ఉన్నారు.



మేలో విడుదల చేస్తాం

సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఆఖరి దశలో ఉన్నాయి. ఈ పనులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయి. వచ్చేనెల మొదటివారంలో ఫస్ట్‌ కాపీ వస్తుంది. మే నెలలో రిలీజు చేయాలని అనుకొంటున్నాం. రిలీజ్‌ తేదీ ఖరారైతే దానికి వారం రోజులముందుగా ఆడియో రిలీజు చేస్తాం. హేమచంద్ర, మాళవిక, దినకర్, ధనుంజయ్, రమ్య బాసర వంటి ప్రముఖ సింగర్లు ఈ సినిమాకు పాడారు.



విశాఖలోనే షూటింగ్‌

4జీ సినిమా షూటింగ్‌ మొత్తం విశాఖ ప్రాంతంలోనే పూర్తి చేశాం. సినిమాకు కావాల్సిన స్పాట్‌లు విశాఖ నగరంలో కూడా ఎక్కువగానే ఉన్నాయి. గాజువాక ప్రాంతంలోని చాలా స్పాట్‌లలో షూటింగ్‌ చేశాం. యారాడ బీచ్‌లో రెండు పాటలను చిత్రీకరించాం. విశాఖకు చెందిన కళాకారులు ఈ సినిమాలో చాలామంది నటించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top