గాడితప్పిన గురుకులం

గాడితప్పిన గురుకులం


ఇంటర్ ఫలితాల్లో ఖేడ్ ‘రెసిడెన్షిల్‌‘ కాలేజీ అధ్వానం

ఫస్టియర్ 10.81, సెకండ్ ఇయర్ 26.67 శాతం ఉత్తీర్ణత


 నారాయణఖేడ్: ఇంటర్ ఫలితాల్లో కొన్ని ప్రభుత్వ కాలేజీలు ‘ఎవరెస్ట్’ అనిపిస్తే.. మరికొన్ని ‘వరెస్ట్’గా మిగిలాయి. ఇందుకు నారాయణఖేడ్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులమే ఉదాహరణ. క్రమశిక్షణ, విద్యాభివృద్ధికి మార్గదర్శకంగా నిలవాల్సిన ఈ గురుకులంలో బోధన గాడితప్పింది. సిబ్బందిలో క్రమశిక్షణ లేకపోవడం.. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో చెత్త రిజల్ట్స్ వచ్చాయి. వివరాలు..


 నారాయణఖేడ్ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 75 మంది విద్యార్థులు ఉండగా పరీక్షకు 74 మంది హాజరయ్యారు. ఇందులో కేవలం 8 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 10.81 శాతం ఉత్తీర్ణత అన్నమాట. ఇక రెండో సంవత్సరానికి సంబంధించి 54 మంది పరీక్షలు రాశారు. వీరిలో జస్‌ట 12 మంది మాత్రమే పాస్ అయ్యారు. 26.67 శాతం ఫలితం. ‘ఏ’ గ్రేడ్‌లో ఏగుగురు, ‘సీ’ గ్రేడ్‌లో ఇద్దరు, ‘డీ’ గ్రేడ్‌లో ఒకరు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి ‘ఏ’, ‘బీ’ గ్రేడ్‌లలో ఒక్కొక్కరూ.. ‘సీ’ గ్రేడ్‌లలో ముగ్గురు, ‘డీ’ గ్రేడ్‌లో 8 మంది పాస్ అయ్యారు. 


 కానరాని పర్యవేక్షణ

గురుకులంలో ఇబ్బందులపై అనేకసార్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. భోజనం విషయంలోనూ విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అధికారులు తూతూ మంత్రంగా విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా దారుణమైన ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ఉన్నతాధికారులు మొదట్లోనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి, శ్రద్ధ చూపితే ఫలితాలు మెరుగ్గా ఉండేవని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలుగు సబ్జెక్టులోనే 16 మంది ఫెయిల్ అయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అత్యధికంగా కెమిస్ట్రీలో 51 మంది తప్పారు. సబ్జెక్టుల వారీగా ఇంగ్లిష్‌లో 34 మంది, మ్యాథ్స్(ఏ)లో 26, (బీ)లో 30, బోటనీ 28, జువాలజీ 22, ఫిజిక్స్ 36 మంది ఫెయిల్ అయ్యారు. ఇక రెండో సంవత్సరం ఇంగ్లిష్‌లో 3, తెలుగు 2, మ్యాథ్స్(ఏ) 8, (బీ) 14, బోటనీ 12, జువాలజీ 13, ఫిజిక్స్ 13, కెమిస్ట్రీలో 9 మంది తప్పారు.


 ఇదే మొదటి‘సారీ’

ఈ ఏడాదే గురుకులంలో ఇంతటి దారుణమైన ఫలితాలు సాధించింది. గత నాలుగేళ్లలో ఇలాంటి రిజల్ట్స్ రాలేదు. 2012- 13వ సంవత్సరంలో 69 మందికి 28 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 40.57 శాతం ఫలితం వచ్చినట్టు. 2013-14లో 68 మందికి 39 మంది పాస్ ఉత్తీర్ణత శాతం 57.35. ఇక 2014- 15లో 34 మందికి 22 మంది పాస్ అయ్యారు. అంటే 64.71 శాతం ఉత్తీర్ణత. గురుకులంలో భోజనం, వసతితో కూడిన విద్య అందిస్తారు. ఫిజిక్స్, ఇంగ్లిష్, మాథ్స్ సబ్జెక్టులకు మాత్రమే లెక్చరర్లు ఉండగా కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, తెలుగుకు అధ్యాపకులు లేదు. ఈనేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి గురుకులం అన్ని సౌకర్యాలున్న అధునాతన భవనంలోకి మారనుంది. అక్కడైనా ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top