ధరపై కిరికిరి!

ధరపై కిరికిరి! - Sakshi


రెండు పడక గదుల ఇళ్లు మరింత ఆలస్యం

యూనిట్ విలువ పెంచేందుకు సీఎం ససేమిరా

అదే ధరకు నిర్మించేందుకు కాంట్రాక్టర్ల విముఖత

వచ్చే నెలలో ఎస్‌ఎస్‌ఎస్ రేట్లపై నిర్ణయం

ప్రభుత్వంపై భారం మరింత పెరిగే అవకాశం


 ‘రెండు పడక గదుల ఇళ్ల’ నిర్మాణంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. నిర్దేశిత యూనిట్ విలువ పెంచేందుకు సర్కారు  ససేమిరా అనడంతో ఇళ్లకు ఇప్పట్లో పునాదిరాయి పడే అవకాశం కనిపించడంలేదు. ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ ధరకు  అనుగుణంగా డబుల్ బెడ్‌రూం గృహాలను నిర్మించలేమని కాంట్రాక్టు సంస్థలు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాణ అంచనా వ్యయాన్ని సవరించాలని ప్రభుత్వానికి గృహనిర్మాణ శాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే, గృహ నిర్మాణ శాఖ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ తోసిపుచ్చారు. గతంలో నిర్దేశించిన యూనిట్ విలువకే డబుల్ ఇళ్లను నిర్మించాలని తేల్చిచెప్పారు.


  తొలివిడతగా జిల్లాకు 6,850 గృహాలను కేటాయిం చారు. గ్రామీణ ప్రాంతాల్లో 3,610, పట్టణ ప్రాంతాల్లో 3,240 ఇళ్లు నిర్మించాలనేది ప్రణాళిక. ఇందుకోసం 105 చోట్ల స్థలాలను సైతం ఎంపిక చేశారు.  గ్రామాల్లో రూ.5.04 లక్షలు, పట్టణాల్లో రూ.5.30 లక్షలను యూనిట్ కాస్ట్‌గా ప్రభుత్వం నిర్ణయించింది.  ఒక ఇంటి యూనిట్ విలువను సగటున రూ.70 వేలు పెంచితే తప్ప ఇళ్ల నిర్మాణ పథ కంలో భాగస్వాములను కాలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : డబుల్ బెడ్‌రూం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పేదోడికి నివాసయోగ్యం కల్పించాలనే ఉద్దేశంతో పథకానికి డిజైన్ చేసింది. ఈ మేరకు యూనిట్ విలువను నిర్దేశించింది. గ్రామీణ ప్రాంతంలో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలను యూనిట్ కాస్ట్‌గా ప్రకటించింది. ఈ మేరకు తొలివిడతగా జిల్లాకు 6,850 గృహాలను మంజూరు చేసింది. దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,610,పట్టణ ప్రాంతాల్లో 3,240 ఇళ్లను లబ్ధిదారులకు నిర్ధేశించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 105 చోట్ల స్థలాలను ఎంపిక చేసి లేఅవుట్లను కూడా డిజైన్ చేసింది.


దీంట్లో ఇప్పటికే 80 లేఅవుట్లు తుది దశకు కూడా చేరాయి. లేఅవుట్లు కొలిక్కిరాగానే.. నిర్మాణ పనులకు టెండర్లను ఖరారు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. ఒక ఇంటి యూనిట్ విలువను సగటున రూ.70 వేలు పెంచితే తప్ప డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పథ కంలో భాగస్వాములను కాలేమని తెగేసి చెప్పారు. యూనిట్ విలువను రాష్ట్రస్థాయిలో ఖరారు చేసినందున.. ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయం కోసం ఇన్నాళ్లు జిల్లా యంత్రాంగం ఎదురుచూసింది.


తాజాగా, సీఎం కేసీఆర్ యూనిట్ విలువను పెంచేదిలేదని, పాత ధరలకే ఇళ్లను నిర్మించాలని స్పష్టం చేశారు. దీంతో ఇన్నాళ్లు యూనిట్ కాస్ట్ కాస్తో కూస్తో పెరుగుతుందని ఆశించిన యంత్రాంగం తాజా పరిణామంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఒక ఇంటికి సగటున రూ.70వేలు పెట్టుకున్నా.. ఇది జిల్లా స్థాయిలో రూ.47.95 కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా వేసింది. ఇళ్ల డిజైన్‌లో మార్పులు చేస్తే తప్ప.. నిర్దేశిత యూనిట్ విలువకు కాంట్రాక్టు సంస్థలు ముందుకు రావడం అసాధ్యంగా కనిపిస్తోంది.


 జూన్ దాటితే మరింత భారం!

సాధ్యమైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాలని భావించిన సర్కారుకు యూనిట్ విలువ రూపంలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. అదనపు భారం భరించేదిలేదని, పాత ధరలకే ఇళ్లను నిర్మించాలని పట్టుబడుతున్న సర్కారుపై ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల రూపంలో మరో గుదిబండ పడనుంది. ప్రతి ఏటా జూన్‌లో ఎస్‌ఎస్‌ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్స్ ఆఫ్ రేట్ల)పై ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. సిమెంట్, కంకర, ఇసుక , ఇనుము ధరలను ప్రామాణికంగా తీసుకొని ఏటా కనిష్టంగా 10శాతం పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేట్లను పెంచేందుకు మరో నెల రోజులే మిగిలి ఉంది. ఈ లోపు టెండర్లు ఖరారుచేసి పనులు అప్పగిస్తే సరే సరి. లేకపోతే ప్రభుత్వానికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు తడిసిమోపెడు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే నెల రోజుల్లో టెండర్లను పిలవడం.. పనులు ఖ రారు చేయడం సాధ్యమయ్యే పనికాదు. ఈ పరిణామాలన్నింటినీ విశ్లేషిస్తే పథకం ఇప్పట్లో పట్టాలెక్కెలా కనిపించడంలేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top