శ్రీగంధంపై కన్నేశారు!

శ్రీగంధంపై కన్నేశారు!


శేషాచలం, నల్లమల్ల అడవులను టార్గెట్ చేస్తున్న స్మగ్లర్లు

అడవి బాగా తెలిసిన వారి ద్వారా కదులుతున్న వైనం

ఎర్రచందనంపైనే దృష్టిపెట్టిన పోలీసులు

ఇదే అదునుగా ఎల్లలు దాటిస్తున్న అక్రమార్కులు

చెట్లను నరికి చిన్నచిన్న  మొద్దులుగా చేసి సూట్‌కేసుల్లో  తరలిస్తున్నట్లు ప్రచారం

రెండింటిపై  దృష్టిపెట్టామన్న ఎస్పీ


సాక్షి, కడప :  అందరి దృష్టి ఎర్రచందనంపైనే... అటు పోలీసులు, ఇటు ఫారెస్టు అధికారులు ఎర్రచందనం ఎల్లలు దాటకుండా ఉండేందుకు ఎక్కడచూసినా చెక్‌పోస్టులు.. చెకప్‌లు... అడవిలో కూంబింగ్‌లు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది స్మగ్లర్లు రూట్‌మార్చారు. నిఘా బాగా పెరిగిన నేపథ్యంలో ఎర్రచందనాన్ని వదిలేసి శ్రీగంధం చెట్లపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. శేషాచలం, నల్లమల అడవుల్లో అరుదుగా లభించే శ్రీగంధాన్ని నరికి సరిహద్దులు దాటిస్తున్నారు. పైగా గంధపు చెట్లను నరికి చిన్నచిన్న మొద్దులుగా తయారు చేసి వాటిని సూట్‌కేసుల్లో భద్రపరిచి జాగ్రత్తగా అడవులు దాటిస్తున్నట్లు తెలియవచ్చింది. అలవాటైన కొంతమంది పోలీసు, ఫారెస్టు అధికారులకు మామూళ్లు సమర్పిస్తూ అదను చూసి అక్రమంగా తరలించుకుపోతున్నట్లు తెలుస్తోంది.


అడవిపై పట్టున్న వారి ద్వారా సేకరణతమిళనాడు ప్రాంతంలో పేరుమోసిన స్మగ్లర్ వీరప్పన్ అనుచరులుగా ముద్రపడిన కొంతమంది అనుభవజ్ఞులైన వారి ద్వారా శ్రీగంధం చెట్ల నరికివేత జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఎర్రచందనం చెట్లతో పోలిస్తే నల్లమల, శేషాచలం అడవుల్లో శ్రీగంధం చెట్లు చాలా తక్కువ. అయితే రేటు మాత్రం చాలా ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీగంధమే మేలని భావించిన కొంతమంది స్మగ్లర్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. అరుదుగా శ్రీగంధం చెట్లు ఉండటంతో అడవిపై పట్టున్న వారు మాత్రమే చెట్లు ఎక్కడెక్కడ ఉండేది గుర్తు పట్టగలరు. వారి సహకారంతోనే అడవుల్లో రంగప్రవేశం చేస్తున్న కొందరు అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తున్నారు.


సూట్‌కేసుల్లో తరలింపు

స్మగ్లర్లు తెలివిగా శ్రీగంధం చెట్లను నరికి చిన్నచిన్న మొద్దులుగా తయారు చేసి సూట్‌కేసుల్లో భద్రపరిచి తరలిస్తున్నారు. వాటిని రాయచోటి మీదుగా బెంగళూరుకు తరలిస్తున్నారని, మరోపక్క హైదరాబాద్, కేరళ, తమిళనాడు లాంటి ప్రాంతాలకు కూడా పంపిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే చిన్నచిన్న మొద్దులను బాక్సుల్లో పెట్టి ఓ ప్రైవేటు బస్సుల్లో లగేజీ కింద పెట్టి ఇక్కడి నుంచి పంపగా.....హైదరాబాద్‌లో సంబంధిత వ్యక్తులు వచ్చి హడావుడిగా తీసుకెళ్లారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్‌లో బస్సును తనిఖీ చేసే సమయానికే దుంగలను తరలించుకుపోవడంతో వ్యవహారం బట్టబయలు కాలేదు. అప్పటి నుంచి పోలీసులు ప్రైవేటు బస్సుల యజమానులకు జాగ్రత్తలు సూచించారు. ఏది ఏమైనా  స్మగ్లర్లు ఎప్పటికప్పుడు ఎత్తుకుపైఎత్తులు వేస్తూ విలువైన దుంగల్ని తరలించుకుపోతున్నారు.


ఏది తరలించినా వదలం : ఎస్పీ

ప్రత్యేకంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు. ఎర్రచందనాన్ని, శ్రీ గంధంను తరలించే వారిని వదిలిపెట్టే సమస్యే లేదని తేల్చిచెప్పారు. పోలీసులపై కూడా ఆరోపణలు రాకుండా ఇక నుంచి రొటేషన్ పద్ధతిలో....జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోని కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు అందరినీ వినియోగించుకుంటామని తెలియజేశారు. అంతేకాకుండా చందనం అక్రమ రవాణా నివారణకు టాస్క్‌ఫోర్స్, లీగల్, కూంబింగ్, ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్మగ్లర్లను పట్టుకొచ్చేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అలాగే డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సంఘటనా ప్రాంతాన్ని పసిగట్టి ఎర్రస్మగ్లర్ల ఆట కట్టించేందుకు వ్యూహాలు రచించామని ఆయన వివరించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top