సర్వేలో ‘చదువు’

సర్వేలో కార్పొరేషన్‌ టీచర్లు - Sakshi

– విద్యాహక్కు చట్టానికి పాతర

– రాష్ట్రంలోని 12 కార్పొరేషన్‌న్లలో సర్వే నుంచి టీచర్లు వెనక్కి

– తిరుపతిలో మాత్రం సర్వే చేయాల్సిందేనని హుకుం

– ఇలాగైతే పది ఫలితాలు గోవిందా!

తిరుపతి తుడా: చదువు..సర్వేపాలవుతోంది. టీచర్లందరూ ప్రజాసాధికార సర్వేలో నిమగ్నమవ్వడంతో పాఠాలు చెప్పేనాథుడులేక తరగతులన్నీ బోసిపోతున్నాయి. ఇలాగే కొనసాగితే ‘పది’ ఫలితాల్లో మళ్లీ ఫల్టీ కొట్టడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 31 వరకు ప్రజా సాధికార సర్వే(స్మార్ట్‌ పల్స్‌ సర్వే) మొదటి విడతని ప్రారంభించింది. కార్పొరేషన్‌ ఉద్యోగులు, ఎన్యూమరేటర్లతో పాటు నగర పాలిక విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులను సర్వే విధులకు కేటాయించారు. విద్యా హక్కుచట్టం ప్రకారం విద్యా బోధనకే పరిమితమవ్వాల్సిన ఉపాధ్యాయులను ఇతరత్రా పనులకు కేటాయిస్తూ కార్పొరేషన్‌ అధికారులు తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు రెండు నెలల పాటు ఉపాధ్యాయులు స్కూల్‌కు దూరమైతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

 

సర్వేలో 76 మంది టీచర్లు

 తిరుపతి నగర పాలిక సంస్థ పరిధిలో మొత్తం 44 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు పది వేల మంది  విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన 36 మంది టీచర్లతో పాటు, మరో 40 మందిని సర్వేకు కేటాయించారు. ప్రస్తుతం సర్వేలో మొత్తం 76 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 18 రోజులుగా విద్యార్థులకు విద్యాబోధన కరువైంది.

 

మేమింతే!

రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లలో ఒక్క తిరుపతి తప్ప మిగిలిన 12 కార్పొరేషన్లలో సర్వే నుంచి టీచర్లను తప్పించారు. అయితే తిరుపతి కార్పొరేషన్‌లో అందుకు విరుద్ధంగా టీచర్లను సర్వేకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము పాఠశాలల్లో అపాయింట్‌మెంట్‌ అయ్యి నెల కూడా కాలేదని, పాఠశాలల పరిస్థితులు, వాతావరణం అర్థం చేసుకునేలోపే మమ్మల్ని నెలల తరబడి స్కూళ్లకు దూరం చేయడం ఏమిటని.. ఇటీవల డీఎస్పీ ద్వారా ఎంపికైన టీచర్లు వాపోతున్నారు. 

 

మరింత భారం 

ఇటీవల ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ బోధన, ఐఐటీ ఫౌండేషన్‌ను ప్రవేశ పెట్టారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల చేరిక 10 శాతం పెరిగింది. 8, 9, 10 తరగతుల విద్యార్థులు సమగ్ర మూల్యాంకణం పరిధిలోకి వస్తారు. ఈ విధానం ప్రకారం ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయుల పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండాలి. రాత పరీక్ష ద్వారా 80 మార్కులు, టీచర్లు 20 మార్కులకు విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనావేసి మార్కులు కేటాయిస్తారు. అయితే సర్వే కారణంగా రెండు విడతల్లో టీచర్లు సుమారు రెండు నెలల పాటు పాఠశాలలకు దూరం కావాల్సి ఉన్న నేపథ్యంలో పది ఫలితాలపై దీని ప్రభావం పడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top