గుడ్లా.. గురివిందలా..?

గుడ్లా.. గురివిందలా..? - Sakshi


చిన్న సైజు గుడ్లు మాకొద్దు..

తిరస్కరించిన అంగన్‌వాడీలు

చీమకుర్తి పట్టణంలో ఘటన


 

చీమకుర్తి: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న గుడ్లు పరిమాణంలో గురివింద గింజల్ని తలపిస్తున్నాయి. గుడ్డు బరువు 50 గ్రాములకు తగ్గకుండా ఉండాలని నిబంధనలున్నా.. సైజు తక్కువగా ఉంటే తీసుకోవద్దని అంగన్‌వాడీ కార్యకర్తలను ఐసీడీఎస్‌ అధికారులు ఆదేశిస్తున్నా.. కాంట్రాక్టర్లు మాత్రం తమ అలవాటు మార్చుకోవడం లేదు. దీంతో సోమవారం చీమకుర్తిలోని అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు గుడ్లు సరఫరా చేసేందుకు వచ్చిన వాహనాన్ని తిప్పిపంపించారు. చిన్న సైజులో ఉన్న గుడ్లు మాకొద్దంటూ తేల్చి చెప్పేశారు.

 

నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్‌ ఎం.శ్రీథర్‌బాబు పాఠశాలలకు, అంగన్‌వాడి కేంద్రాలకు కోడిగుడ్లను  సరఫరా చేస్తుంటాడు. ఎప్పటిలాగే సోమవారం చీమకుర్తిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లును సరఫరా చేసేందుకు గుడ్ల లోడుతో ఉన్న వాహనం వచ్చింది. స్థానిక దిన్నెపురం అంగన్‌వాడీ కేంద్రానికి 528 కోడిగుడ్లు, నవాబ్‌పేటలోని అంగన్‌వాడీ కేంద్రానికి 528, రామ్‌నగర్‌లోని అంగన్‌వాడి కేంద్రానికి 333 గుడ్లు ఇవ్వాల్సి ఉంది.



అంగన్‌వాడీ కార్యకర్తలు మరీ చిన్నగా ఉన్న ఆ గుడ్లను చూసి ఇవి మాకొద్దు అని తిరస్కరించారు. వాటిని తీసుకుంటే తమ ఉద్యోగాలు పోతాయని, వెనక్కి తీసుకువెళ్లాలని కోరారు. అంగన్‌వాడీ టీచర్లు డి.వాణి, సీతామహలక్ష్మి, రమాదేవిలు అభ్యంతరం చేపట్టంతో చేసేది లేక కాంట్రాక్టరు తరపున వచ్చిన రవీంద్రరెడ్డి కోడి గుడ్లును వెనక్కు తీసుకెళ్లాడు.    ఇలా తిరస్కరిస్తున్న సందర్భాల్లో కాంట్రాక్టర్లు అధికారుల అధికారుల ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలపై ఒత్తిడి తీసుకొచ్చిమరీ వాటినే తీసుకునేలా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top