ప్రతిధ్వనించిన పంచాక్షరి.. పరవళ్లు తొక్కిన భక్తఝరి

ప్రతిధ్వనించిన పంచాక్షరి.. పరవళ్లు తొక్కిన భక్తఝరి

- ఊరూరా మహాశివరాత్రి వేడుకలు

-వేకువ నుంచే పుణ్యస్నానాలు, దర్శనాలు

-కళకళలాడిన ప్రముఖ శైవక్షేత్రాలు

 

ప్రతి ఊరిలో, ప్రతి ఏరులో.. ఎక్కడ చూసినా వెండికొండ వేలుపు పండగ సందడే. ఎక్కడ విన్నా ‘నమశ్శివాయ’ ఆ పరమేశుని నామస్మరణే. శుక్రవారం వేకువకు ముందే నీటిపట్టులకు భక్తజనం పోటెత్తారు. పావన స్నానాల అనంతరం పార్వతీనాథుని కోవెలల వద్ద బారులు తీరారు. మహా శివరాత్రి పర్వం సందర్భంగా జిల్లాలో వనసీమ నుంచి కోనసీమ వరకూ భక్తిప్రపత్తులు పరవళ్లు తొక్కాయి. సామర్లకోట, పాదగయ, ద్రాక్షారామ, కోటిపల్లి వంటి ప్రముఖ శైవ క్షేత్రాలతో పాటు ప్రతి ఊరిలో ఆ మహాదేవుడు కొలువైన ఆలయాలు కళకళలాడాయి. పలు ఆలయాల వద్ద గంగాధరునికి అభిషేకాలు, రథోత్సవాలు, కల్యాణోత్సవాలు కనులపండుగలా జరిగాయి. అనేకులు హృదయం నిండా గౌరీపతిని నింపుకొని శుక్రవారం రేయంతా జాగరణ చేశారు. కోరిన వరాలిచ్చే బోళాశంకరుని మహాపర్వంలో స్వచ్ఛందసేవలు వెల్లువెత్తాయి. పన్నగధారి పండుగలో అన్నపానీయాల వితరణకు హద్దే లేదంటే అతిశయోక్తి కాదు.

 

అర్ధరాత్రి నుంచే భీమేశునికి అర్చనలు

సామర్లకోట :పంచారామ క్షేత్రమైన శ్రీకుమారరామ భీమేశ్వరాలయాన్ని అర్ధరాత్రి 12.15 గంటలకు తెరిచి స్వామి వారికి తొలి అభిషేకం, పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు స్వామి వారిని, బాలాత్రిపురసుందరీదేవిని దర్శించుకున్నారు. పట్టణానికి దూరంగా గోదావరి కాలువ ఆవలివైపు ఆలయం ఉన్నా కిలోమీటరు పొడవున భక్తులు బారులు తీరి, స్వామి వారిని దర్శించుకున్నారు. 

సోమేశ్వరుని సన్నిధికి పోటెత్తిన భక్తులు

కోటిపల్లి(కె.గంగవరం) :  కోటిపల్లిలో కొలువైయున్న శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు లక్ష మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రామచంద్రపురం సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్సై నరేష్‌ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పడవలు, గత ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదానం చేశాయి. 

పాదగయకు భక్తజన వరద

పిఠాపురం : పాదగయ పుణ్యక్షేతానికి గురువారం అర్ధరాత్రి నుంచే భక్తులు ఆలయం చేరుకున్నారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీదేవి, పురుహూతిక అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో పిఠాపురమే జనసంద్రంగా మారింది. గురువారం అర్ధరాత్రి తర్వాత  స్వామికి లక్షపత్రి పూజలు, అభిషేకాలు, మంత్రపుష్పాలు, బిళ్వార్చన, అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించి సర్వదర్శనం కొనసాగించారు. సాయ్రంతం స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక అలంకరణ చేశారు.  కార్మికమంత్రి కె.అచ్చెన్నాయుడు, పలువురు ప్రముఖులు స్వామి వార్ని దర్శించుకున్నారు. పాదగయ వద్ద బ్రహ్మకుమారీస్‌ సంస్థ  81 రకాల విత్తనాలతో తయారు చేసిన శివలింగం, అంబికా దర్బారు బత్తి సంస్థ స్వామికి సమర్పించిన 7 అడుగుల భారీ అగరుబత్తీ ఆకట్టుకున్నాయి.

ద్రాక్షారామ భీమేశునికి ఏకాదశ రుద్రాభిషేకం

ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్‌) : పంచారామ క్షేత్రమైన  ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు.  తెల్లవారుజాము నుంచే సప్తగోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీమాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రుత్విక్కులు, వేదపండితులు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామిని కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకరం తదితర ప్రముఖులు దర్శించుకున్నారు.

రాజమహేంద్రవరం కల్చరల్‌ :  గంగమ్మను తలపై దాల్చిన శివయ్య నామస్మరణతో గోదావరీతీరం మారుమోగింది. ఎక్కడ విన్నా పంచాక్షరీపారాయణలే, ఎటుచూసినా అభిషేకప్రియునికి అఖండ పంచామృతాభిషేకాలే. పుష్కరఘాట్‌, కోటిలింగాలఘాట్, మార్కండేయఘాట్, గౌతమఘాట్‌.. ఏ రేవు చూసినా భక్తజనుల వెల్లువలే. శ్రీఉమాకోటిలింగేశ్వరస్వామి రథయాత్ర కన్నులపండువగా సాగింది.  శ్రీఉమామార్కండేయేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. రాజగురు, ఆగమాచార్య డాక్టర్‌ ఎం.ఆర్‌.వి.శర్మ కల్యాణానికి వ్యాఖ్యానం చేశారు. ‘శివం’ అన్న శబ్దానికి మంగళమని అర్థమని వివరించారు. గోదావరిగట్టుపై ద్విచక్రవాహనాలకు మించి, మిగతా వాహనాలను అనుమతించలేదు.

కమనీయం కొప్పేశ్వరుని రథోత్సవం

కొత్తపేట : పలివెలలో ఉమా కొప్పేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం కోలాహలంగా జరిగింది. ఉత్సవాన్ని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.ముందుగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, లావణ్యవేణి దంపతులు, తరువాత ఎమ్మెల్సీ ఆర్‌ఎస్‌, ఎంపీపీ అనంతకుమారి దంపతులు స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు  తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top