నోరు మెదపరేం?

నోరు మెదపరేం? - Sakshi

  • ప్రధానిపై ఏచూరి మండిపాటు

  • మన్మోహన్‌ను ‘మౌన ప్రధాని’ అన్నారుగా..

  • ఇప్పుడు మీరూ అలాగే తయారయ్యారు

  • పెద్దనోట్ల రద్దుతో ప్రయోజనం ఏంటి?

  • నల్లధనం ఉన్నవారు ఇప్పటికే సర్దుకున్నారు

  • నేటి భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపు

  • సాక్షి, మెదక్: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంట్‌లో ప్రధాని నోరు మెదపడం లేదని, మౌన మోదీ లా తయారయ్యారని సీపీఎం ప్రధాన కార్య దర్శి సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ‘మౌన మోహన్‌సింగ్’ అని అభివర్ణించిన మోదీ.. ఇప్పుడు తానే మౌనం దాల్చారన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి 20 రోజులు గడుస్తున్నా పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ సోమవారం ‘ఆక్రోశ్ దివస్’ పేరిట తలపెట్టిన భారత్ బంద్‌ను విజ యవంతం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలసి ఆదివారం మెదక్ జిల్లాలో ఆయన ‘మహాజన పాదయాత్ర’లో పాల్గొన్నారు. చేగుంట మండలం పోలంపల్లిలో దివంగత కమ్యూనిస్టు నేత కేవల్‌కిషన్‌కు నివాళులర్పించారు. తమ్మినేనితో కలసి 3 కి.మీ. మేర పాదయాత్ర చేశారు. అనంతరం చేగుంటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు.



    పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని, ఇప్పటివరకు 75 మంది చనిపోయారన్నారు. ‘‘నల్లధనం ఉన్నవారంతా ఇప్పటికే సర్దేసుకున్నారు. టైస్టులకు విదేశీ బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు అందుతున్నాయి. పెద్దనోట్ల రద్దుతో వారి ఫండింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇప్పటికే బెంగళూరులో నకిలీ రూ.2 వేల నోట్లు వచ్చాయి. రూ.2 వేల నోట్లతో అవినీతి మరింత పెరుగుతుంది. పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీలు విరాళాలు సేకరించకుండా చట్టం తీసుకురావాలి. అప్పుడే అవినీతి తగ్గుతుంది’’  అని అన్నారు.



    పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఫ్యాక్టరీలు మూతబడుతున్నాయని ఏచూరి అన్నారు. 4 లక్షల మంది రోజువారీ కార్మికుల ఉద్యోగాలు కోల్పోయారని, 4 కోట్ల మంది కూలీలకు పనులు దొరకటం లేదని పేర్కొన్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, కొత్తనోట్లు లేక రైతుల నుంచి ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోలు చేయటం లేదని చెప్పారు. దీంతో రైతులు సగం ధరకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ వచ్చాక దేశంలో 26 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. పారిశ్రామికవేత్తలు తీసుకున్న లక్షా పన్నెండు వేల కోట్ల రుణాలు రద్దు చేసిన ప్రభుత్వం రైతుల రూ.75 వేల కోట్ల రుణాలు మాఫీ చేయటంలేదన్నారు.

     

    బీజేపీకి మూడో తలాక్ ఖాయం

    దేశంలో ఎస్సీ, మైనార్టీలపై దాడులు పెరిగాయని సీతారాం ఏచూరి ఆరోపించారు. యూపీ ఎన్నికల్లో గెలుపు కోసమే మోదీ ప్రభుత్వం ‘ట్రిపుల్ తలాక్’ అంశం తెరపైకి తీసుకువచ్చిందన్నారు. ఢిల్లీలో బీజేపీని ఓడించి ప్రజలు మోదీకి మొదటి తలాక్ ఇచ్చారని, బిహార్ ప్రజలు రెండో తలాక్ ఇచ్చారని, ఇక యూపీ ప్రజలు మూడో తలాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చటంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలు తమ డిమాండ్ల సాధన కోసం సీపీఎంతో కలసి ప్రజాపోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top