బావే సూత్రధారి

బావే సూత్రధారి


సింహాద్రి హత్య కేసులో ముగ్గు్గరిని అరెస్ట్‌ చేసిన ద్వారకా  పోలీసులు

ఇద్దరితో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న మృతుని బావవివరాలు వెల్లడించిన ఏసీపీ

రామచంద్రరావు, సీఐ రాంబాబు




సీతమ్మధార (విశాఖ ఉత్తరం) : ఆస్తి తగాదాలు, చిన్నచిన్న గొడవలు పెరిగి పెద్దవై హత్యకు దారి తీశాయి. సొంత చెల్లెలి భర్తే కిరాయి మనుషులతో బావమరిదిని హత్య చేసేందుకు రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకునేలా చేశాయి. నగరంలోని గాంధీనగర్‌ ప్రాంతంలో సంచలనం సృష్టించిన వంకల సింహాద్రి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గతంలో ఉన్న ఆస్తి తగాదాల వల్లే సొంత చెల్లెలు భర్త పథకం ప్రకారం హత్య చేయించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంగళవారం మధ్యాహ్నం ద్వారక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ పి.రామచంద్రరావు వెల్లడించారు.



గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన వంకల సింహాద్రి చాలా కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు.  ఈ క్రమంలో ఆస్తి విషయంలో చెల్లెలి భర్త వీనుకొండ వీర వెంకట సురేష్‌తో తరచూ గొడవలు జరుగుతుండేవి. నిత్యం ఏదో ఒక విషయంపై సింహాద్రి మీద పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టించేందుకు బావ ప్రయత్నించేవాడు. ఈ నేపథ్యంలో మార్చి నెల ప్రారంభంలో (హత్య జరగడానికి వారం రోజుల ముందు) జరిగిన కొట్లాటలో బావను సింహాద్రి కొట్టాడు. దీంతో పగ తీర్చుకోవడంతోపాటు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సురేష్‌ భావించాడు.



రూ.5 లక్షలకు ఒప్పందం

కొటక్‌ మహేంద్రలో బీమా మేనేజర్‌గా పనిచేస్తున్న సురేష్‌ తన వద్ద ఏజెంట్‌గా పనిచేస్తున్న కొల్లపల్లి జ్యోతి భాస్కర్‌ శ్రీధర్‌(20)కు జరిగిన కొట్లాట విషయం చెప్పి ఎలాగైనా సింహాద్రిని అంతమొందించాలని కోరారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన శ్రీధర్‌ ఉద్యోగరీత్యా ఏడాది కిందట నగరానికి వచ్చి మద్దిలపాలెం సమీపంలోని కృష్ణా కళాశాల వద్ద నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ఉంటున్న తన స్నేహితుడు కాండ్రేగుల సాయిరాం (22) అలియాస్‌ చిరుతను సురేష్‌కు పరిచయం చేశాడు అనాథ అయిన సాయిరాం గతంలో చిన్నచిన్న నేరాలకు పాల్పడ్డాడు. సింహాద్రి హత్య చేసేందుకు వీరిరువురితో సురేష్‌ రూ.5లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం మంచి ఉద్యోగాలు ఇప్పస్తానని కూడా చెప్పారు.



తీవ్ర పెనుగులాట తర్వాత హత్య

ఈ నెల 9న గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో సింహాద్రి ఇంటికి శ్రీధర్, సాయిరాం వెళ్లి తలుపుకొట్టారు. సింహాద్రి తలుపు తీసిన వెంటనే ఇద్దరూ ఒక్కసారిగా దాడి చేశారు. అనూహ్య ఘటనతో బిత్తరపోయిన సింహాద్రి ప్రతిఘటించడంతో ఆ ప్రాంతంలోనే ఉన్న బీరువా, టీవీ అద్దం పగిలి ధ్వంసమయ్యాయి. అక్కడే లభించిన గాజు ముక్కతో సింహాద్రి గొంతులో సాయిరాం గుచ్చడంతో కుప్పకూలిపోయి మరణించాడు. హత్య జరిగిన తర్వాత నిందితులిద్దరూ చేతులు కడుక్కునేందుకు సురేష్‌ నీళ్లిచ్చి సత్యం జంక్షన్‌ వద్ద ఉండమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్లి వారిద్దరికీ తగిలిన గాయాలకు చికిత్స చేయించుకోమని రూ.15వేలు ఇచ్చాడు. మరసటి రోజు ఇసుకతోట దరి ఒక బార్‌ వద్దకు వెళ్లి ఇద్దరికీ రూ.30 వేలు ఇచ్చాడు.



మిస్టరీ ఛేదించిన పోలీసులు

హత్య జరిగిన రెండు రోజుల తర్వాత సింహాద్రి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో ఈ నెల 11న ద్వారక పోలీసులు రంగంలోకి దిగారు. ముందు నుంచీ ఆస్తి తగాదాలే హత్యకు దారితీసి ఉంటాయని భావించిన పోలీసులు మృతుడి బావ సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.అతడి ఫోన్‌కాల్స్‌ ఆధారంగా విచారణ చేపట్టి హత్య చేసిన ఇద్దరితోపాటు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని ఏసీపీ రామచంద్రరావు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన సీఐ, ఎస్‌ఐలు, సిబ్బందిని అయన అభినందించి రివార్డులు అందజేశారు. సమావేశంలో సీఐ రాంబాబు, ఎస్‌ఐలు బి.మురళి, కె.మధుసూదనరావు, అడపా సత్యారావు, ఏఎస్‌ఐ ఆనంద్, కానిస్టేబుళ్లు  ఎన్‌.జ్యోతేశ్వరరావు, శంకర్, ఆగస్టిన్‌ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top