లండన్‌ నుంచే కుట్ర !

లండన్‌ నుంచే కుట్ర ! - Sakshi


సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏళ్లనాటి కక్షల నేపథ్యంలో మంగళవారం రాత్రి ఏలూరు నగరంలో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. పెదవేగి మండలం పినకడిమిలో రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన రాజకీయ కక్షలు ఏలూరులోని జేకే ప్యాలెస్ యజమాని భూతం దుర్గారావును పొట్టన పెట్టుకున్నాయి. దరిమిలా ప్రతీ కారేచ్ఛతో హత్యల పరంపర  కొనసాగుతుండగా.. ప్రత్యర్థి కుటుంబానికి చెందిన వారిని వేటాడేందుకు లండన్ నుంచి కుట్ర సాగుతోంది. ఏలూరులో తూరపాటి నాగరాజుపై చోటుచేసుకున్న కాల్పులకు సూత్రధారిగా భావి స్తున్న భూతం గోవింద్ దొరికితేగాని ఈ హత్యాకాండకు తెరపడదని పోలీ సులు భావిస్తున్నారు.



 అయితే, అతడిని పోలీసులు పట్టుకోగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  రెండేళ్లుగా అతడు విదేశాల్లోనే ఉంటూ ప్రత్యర్థులను తుదముట్టించేందుకు ఎప్పటికప్పుడు పథకాలు వేస్తున్నాడని.. ఇందుకు పెద్దఎత్తున నిధులను సమకూరుస్తున్నాడని పోలీస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. తూరపాటి నాగరాజుపై మరోసారి హత్యాయత్నం జరగడంతో భూతం గోవిందు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. భూతం దుర్గారావు హత్యకు ప్రతీకారంగా 2014లో కృష్ణాజిల్లా పెదఅవుటపల్లి వద్ద జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న భూతం గోవింద్ ఇప్పటివరకూ పోలీసులకు చిక్కలేదు.

 

  సింగపూర్, దుబాయ్, లండన్ దేశాల్లో చక్కర్లు కొడుతున్నట్టు అప్పట్లో ప్రచారం సాగింది. గోవింద్ లండన్ వెళ్లినట్టుగా అప్పట్లో విజయవాడ పోలీసులు గుర్తించారు. ఇంటర్‌పోల్ సాయం తీసుకుని, రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసినా అతడిని పట్టుకోలేకపోయారు. విదేశాల్లో పత్రికలు సైతం గోవింద్ జాడ గురించి ఆరా తీస్తున్నాయని అప్పట్లో విజయవాడ పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇప్పటికీ అతడు లండన్ లోనే ఉన్నట్టు చెబుతున్నారు.

 

 పోలీసులతో ఉన్న సత్సంబంధాల కారణంగానే అతను తప్పించుకోగలుగుతున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. బతుకుదెరువు కోసం జాతకాలు చెప్పుకునే గోవింద్ దేశ, విదేశాల్లో తిరిగేంతగా నగదు, పెదవేగిలో 10 ఎకరాలు, పినకడిమిలో 50 ఎకరాలు, కొప్పాకలో 20 ఎకరాలు, కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలోని దిగవల్లిలో 30 ఎకరాల మామిడితోట కలిపి మొత్తంగా వంద ఎకరాలకు పైగా స్థిరాస్తులు కూడబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గోవింద్ తన ఆర్థిక బలంతో విదేశాల్లోనే ఉంటూ ప్రత్యర్థులను మట్టుబెట్టే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు.

 

  తూరపాటి నాగరాజుతోపాటు ఒక రాజకీయ నేతపై టార్గెట్ పెట్టిన గోవింద్ అది పూర్తయ్యే వరకూ పోలీసులకు దొరకడనే ప్రచారం సాగుతోంది. తూరపాటి నాగరాజుపై రెండోసారి హత్యయత్నం జరగడాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ సీరియస్‌గా తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు. పినకడిమిలోనూ గాలింపు జరిపారు. ఇటీవల ఓ పెళ్లి నిమిత్తం వచ్చినవారు ఆ తర్వాత వెళ్లిపోయారని, గోవింద్ వర్గానికి చెందిన మగవారెవరూ ఆ గ్రామంలో లేరని తేలింది. నేర చరిత్ర ఉన్న వారందరి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.



 

  గోవింద్ విజయవాడ పోలీసులతోపాటు హైదరాబాద్ సరూర్‌నగర్ పోలీసులకూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారి కేసుల దర్యాప్తు ఎక్కడివరకూ వచ్చిందనే విషయాన్ని ఇప్పటికే జిల్లా పోలీసులు ఆరా తీశారు. నాగరాజుపై కాల్పులకు తెగబడిన వారు దొరికితేగాని ఈ చిక్కుముడి వీడే అవకాశం కనబడటం లేదు. పోలీసులు ఇప్పటికైనా విదేశాల్లో చక్కర్లు కొడుతున్న గోవింద్‌ను పట్టుకుంటేనే ఈ హత్యాకాండకు ముగింపు పలికినట్టు అవుతుంది. జిల్లా పోలీసులు ఈ కేసు విషయంలో తమ సత్తా ఏ మేరకు చూపిస్తారో వేచి చూడాల్సిందే.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top