ఆర్జీ–1 గనులకు ఇసుక కొరత

ఆర్జీ–1 గనులకు ఇసుక కొరత


► ఆశించిన స్థాయిలో రవాణా కాని బూడిద

► బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం




గోదావరిఖని :
సింగరేణి ఆర్జీ–1 డివిజన్  పరిధిలోని భూగర్భగనులకు ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఆయాగనుల్లోని పని స్థలాల్లో బొగ్గును వెలికితీసిన తర్వాత నింపేందుకు ఇసుక లేకపోవడంతో బూడిదను, ఓసీపీ మట్టి నుంచి వెలికితీసిన ఇసుక నింపుతున్నారు. కానీ 5వేల క్యూబిక్‌ మీటర్ల బూడిద, మట్టి నుంచి తీసిన ఇసుక అవసరం ఉండగా 1500 క్యూబిక్‌ మీటర్ల మేరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికారణంగా బొగ్గు ఉత్పత్తి కుంటుపడుతోంది. ఆర్జీ–1 ఏరియాలో జీడీకే 1వ గని, జీడీకే 2,2ఏ గ్రూపు గని, జీడీకే 5వ గని, జీడీకే 11వ గనిలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ గనుల్లో ఒకనెల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 1.56 లక్షల టన్నులు నిర్ణయిస్తే 1.35 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే వెలికి తీస్తున్నారు. గడిచిన 2016 ఏప్రిల్‌ నుంచి 2017 జనవరి వరకు పరిశీలిస్తే భూగర్భగనుల్లో కేవలం 78 శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది.



యాంత్రీకరణతోనే బొగ్గు ఉత్పత్తి

ప్రస్తుతం ఆర్జీ–1లోని అన్ని గనుల్లో యాంత్రీకరణతోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. జీడీకే 1వ గనిలో ఎస్‌డీఎల్‌ యంత్రాలు, జీడీకే 2,2ఏ గనిలో ఎస్‌డీఎల్‌ యంత్రాలు, జీడీకే 5వ గనిలో ఎల్‌హెచ్‌డీ యంత్రాలు, జీడీకె 11వ గనిలో ఎల్‌హెచ్‌డీ యంత్రాలతో కంటిన్యూయస్‌ మైనర్‌ యంత్రం ద్వారా బొగ్గును వెలికి తీస్తున్నారు. ఈ గనుల ద్వారా రోజుకు సుమారు ఐదు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే గనుల్లో ఏర్పడిన ఖాళీ ప్రదేశాల్లో అంతేమొత్తంలో పైకప్పులు కూలకుండా ఇసుక నింపాలి.



ఇసుక కొరతతో ఇబ్బందులు...

అయితే ప్రస్తుతం ఆర్జీ–1 గనుల్లో 5 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను సాండ్‌ స్టోవింగ్‌ ద్వారా నింపాల్సి ఉండగా అందుకనుగుణంగా ఇసుక లభించడం లేదు. దీంతో చాలా గనుల్లో వర్కింగ్‌ ప్లేస్‌లను అభివృద్ధి చేయకుండా బొగ్గు వెలికితీయడం లేదు. గోదావరినదిలో మేడిపల్లి ఓసీపీ సమీపంలో సింగరేణికి ఇసుక క్వారీ ఉన్నప్పటికీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రాలేదు. గతంలో వెలికితీసిన జల్లారం క్వారీ ప్రస్తుతం మూసివేయడంతో సింగరేణి యాజమాన్యం అనివార్యంగా బూడిదపై ఆధారపడుతోంది.


అయితే కుందనపల్లి సమీపంలోని బాటమ్‌ యాష్‌ (బూడిద)ను ఉపయోగించాలని భావించినా అది గనుల్లో నింపడానికి సరిపోవడం లేదని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల ప్లాంట్‌లోనే విడుదలైన బాటమ్‌యాష్‌ను నేరుగా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికితోడు మేడిపల్లి ఓసీపీ వద్ద మట్టి నుంచి ఇసుకను తీసే ఓబీ ప్రాసెస్డ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా ఇందులో కూడా ఆశించిన ఫలితం కానరావడం లేదు. మొత్తం రోజుకు ఐదు వేల క్యూబిక్‌ మీటర్ల బూడిద గానీ, ఇసుక గానీ అవసరం ఉంటే ఈ రెండు కలిపి 1,500 క్యూబిక్‌ మీటర్లు కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో భూగర్భ గనుల నుంచి ఆశించిన మేర బొగ్గు ఉత్పత్తి రావడంపై ఆశలు పెట్టుకోవద్దని స్థానిక అధికారులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top