చిరు బతుకుల్లో పోర్టు దుమ్ము

చిరు బతుకుల్లో  పోర్టు దుమ్ము


అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్నాయంటూ ప్రపంచ దేశాలతో వాణిజ్య రవాణా ఒప్పందాలు కుదుర్చుకుంటున్న విశాఖ పోర్టు..నగరానికి కాలుష్య కారకంగా పరిణమించింది. పోర్టు కాలుష్యం నగరంలో సుమారు 10 కిలోమీటర్ల మేర విస్తరించింది. నగరంతో పాటు పోర్టులో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు కాలుష్యంతో సతమతమవుతూ దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. పోర్టు పరిధిలో రాశులుగా పోస్తున్న బొగ్గు పొడి, యూరియా, ఇనుపఖనిజం, గంధకం వంటి పలు ఖనిజాలను గూడ్స్‌ వ్యాగన్‌లకు లోడింగ్, అన్‌లోడింగ్‌ చేసేందుకు యంత్రాలతో పాటు వందలాది మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు.



అక్కడ పనిచేసే వారితో పాటు ఆ మార్గంలో ప్రయాణించే వారు అరగంట కన్నా ఎక్కువసేపు నిలబడితే వారు వేసుకున్న వస్త్రాలు నల్లగా మారిపోతున్నాయంటే కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పోర్టులో పనిచేస్తున్న వారికైతే కాలుష్యంతో నిత్యం అనారోగ్యం ఏర్పడుతోంది. పోర్టు ఇన్నర్‌ హార్బర్లో ఎక్కువగా దుమ్ము, ధూళీ నిండిపోతోంది. నిత్యం బొగ్గుపొడితో పాటు ఇతర ఖనిజాలను రవాణా చేసే లారీలు ప్రయాణించే సమయంలో రోడ్డుపై లేచే దుమ్ము తెరలు అటువైపు వచ్చే వాహనచోదకులను, పాదచారులను కమ్మేసి తీవ్రమైన ఇబ్బందికి గురిచేస్తోంది. పోర్టు పరిసరాల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది తమ షిఫ్ట్‌ పూర్తయ్యే సరికి బొగ్గుపొడితో నల్లగా మారిపోతున్నారు. పోర్టులో పనిచేసే వారిని కదిలిస్తే కాలుష్యంతో  పడుతున్న కష్టాలను  వందలకొద్దీ కథలుగా చెబుతారు. కాలుష్య నియంత్రణకు పోర్టు యాజమాన్యం ప్రవేశపెట్టిన పలు విధానాలు అసలు అమలు చేయడం లేదు. పోర్టు ఎటువంటి సేఫ్టీ మెజర్‌మెంట్స్‌ పాటించకపోవడం శాపంగా మారింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top