శిల్పాయే మా అభ్యర్థి


– ప్రకటించిన ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు

– కలిసి పని చేయాలని భూమాకు సూచన

 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డేనని అధికార పార్టీ ప్రకటించింది. ఆ మేరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఎన్నికల్లో కలిసి పనిచేయాలని భూమా నాగిరెడ్డికి మంత్రి సూచించారు. అంతేకాకుండా శిల్పాచక్రపాణిరెడ్డి కుమారుడి పెళ్లిపత్రికను భూమాకు ఇప్పించారు. మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి బరిలో నిలిచారు. సోమవారం నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇద్దరు పార్టీ అధ్యక్షుల మధ్య నెలకొన్న పోరులో అధికారపార్టీ అభ్యర్థికి కలిసికట్టుగా మద్దతిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. పైకి నేతలు కలిసినా.. కిందిస్థాయిలో నేతలు కలిసే అవకాశం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సీటును ఆశించిన కేఈ ప్రభాకర్‌తో పాటు ఇతర అభ్యర్థులు కూడా శిల్పా ఎన్నిక పట్ల గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు కూడా శిల్పాకు సహకరించే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. 

 

నిజంగా కలిసి పనిచేసేరా?

వాస్తవానికి భూమా–శిల్పాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు నిన్నటివరకు ఫిర్యాదులు చేసుకున్నారు. భూమాకు మంత్రి పదవి ఇస్తే పార్టీలో ఉండేది లేదని నేరుగా అధిష్టానానికే ఖరాఖండిగా తేల్చిచెప్పారు. నంద్యాలకు ఉప ఎన్నికలు వస్తే తాము స్వతంత్య్రంగానైనా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ స్థాయిలో బహిరంగంగా విభేదాలు నెలకొన్న ఈ రాజకీయ ప్రత్యర్థులు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేస్తారంటే జిల్లాలో ఏ ఒక్కరూ నమ్మలేకపోతున్నారు. అంతేకాకుండా పైస్థాయిలో వాళ్లిద్దరూ చేయి కలిపితే తాము ఇన్ని రోజుల విభేదాలను మరచిపోయి ఎలా ఓటు వేస్తామని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ కోవలో నంద్యాల ఘటననే వారు ఉదాహరణగా పేర్కొంటున్నారు. 

 

మేమెలా ఓటు వేసేది...!

నంద్యాల టీడీపీ వాట్సాప్‌ గ్రూపులో అసభ్యకర మెసేజ్‌ పంపారంటూ భూమా  అనుచరుడు.. కౌన్సిలర్‌ గంగిశెట్టిపై శిల్పా వర్గీయులైన మిగతా సభ్యులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు కూడా పెట్టారు.ఆయనపై పార్టీ తగిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం మొత్తం శిల్పా సోదరులు దగ్గరుండీ నడిపించారని భూమా వర్గం భావిస్తోంది. అయితే, సున్నితమైన అంశం కావడంతో ఏమీ మాట్లాడకుండా కిమ్మనకుండా ఉండిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము శిల్పాకు ఎలా ఓటు వేస్తామని తమ అనుచరుల వద్ద వారు మాట్లాడుతున్నారు. తమ నాయకుడు వెళ్లి చేయి కలిపినంత మాత్రాన.. ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డ తాము ఎలా మర్చిపోగలమని వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శిల్పా ఓటమి కోసం ఆ పార్టీలోని నేతలే కృషి చేసే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top