విరుచుకుపడిన గాలివాన

విరుచుకుపడిన గాలివాన - Sakshi

షెడ్డు కూలి 309 గొర్రెలు మృతి 

కన్నీరుమున్నీరైన రైతులు

గొల్లప్రోలు (పిఠాపురం) : గొర్రెల మందపై గాలివాన విరుచుకుపడడంతో వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న పెంపకందారులు జీవనోపాధి కోల్పోయారు. శుక్రవారం రాత్రి కురిసిన గాలివానకు దుర్గాడలో 309 గొర్రెలు మృతి చెందగా మరో 32 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గాలివాన తీవ్రతకు గొర్రెలు, మేకల మంద గ్రామానికి చెందిన పూసల సత్తిరాజు పొలంలో నిర్మాణం చేపట్టిన పట్టు పురుగుల పెంపకం షెడ్డు నీడకు చేరాయి. గాలి తీవ్రత ఎక్కువ కావడంతో షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. షెడ్డు గోడలు, పైకప్పు దూలాలు గొర్రెలు, మేకలపై పడడంతో అవి చనిపోయాయి. ఈ ఘటనలో గొర్రెల రైతు కపిలేశ్వరపు పాపారావు, కాపరి ఉగ్గిరాల తమ్మియ్యకు గాయాలు కావడంతో చికిత్స కోసం గ్రామానికి తరలించారు. రాత్రివేళ ఈ సంఘటన జరగడంతో ఏమీ తెలియని పరిస్థితి నెలకొంది. మొదట వంద గొర్రెల వరకు మృతి చెందాయనుకున్నారు. తెల్లారిచూసేసరికి మృతి చెందిన గొర్రెల సంఖ్య  309కు చేరింది. దుర్ఘటన జరిగిన సమయంలో ఏడుగురు రైతులకు చెందిన 600 మేకలు, గొర్రెలు ఉన్నాయి. తాటిపర్తి శ్రీనుకు చెందిన 55, గారపాటి వీరబ్బాయికు చెందిన 75, గారపాటి సత్తిబాబుకు చెందిన 45, పల్లా గోవిందుకు చెందిన 34, తాటిపర్తి సత్తిరాజుకు చెందిన 30, కపిలేశ్వరపు పాపారావుకు చెందిన 30, తాటిపర్తి సూరిబాబుకు చెందిన 40 గొర్రెలు మృతి చెందాయి. వీటితో పాటు మరో 32 గొర్రెలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. 

పరిశీలించిన అధికారులు 

సంఘటనా స్థలాన్ని కాకినాడ ఆర్‌డీఓ ఎల్‌. రఘుబాబు, తహసీల్దార్‌ వై.జయ,  పశుసంవర్ధక శాఖ డీడీ శ్రీనివాస్, ఏడీ డాక్టర్‌ దినకర్, పశువైద్యాధికారి డాక్టర్‌ ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు మడికి ప్రసాద్, టీడీపీ నాయకులు ఎస్‌వీఎస్‌ఎ¯ŒS రవివర్మ, మండల టీడీపీ అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు, స్థానిక నాయకులు కొమ్మూరి కృష్ణ, తూము బాబు తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. ఆర్‌డీఓ రఘుబాబు  మాట్లాడుతూ గొర్రెలకు ఇన్సూరె¯Œ్స చేయిస్తే బీమా పరిహారం అందుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వపరంగా పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు.

కన్నీరు మున్నీరైన పెంపకందారులు

తమ జీవనాధారం కోల్పోవడంతో గొర్రెల పెంపకందారులు కన్నీరుమున్నీరయ్యారు. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న గొర్రెలు కళ్లెదుటే విలవిలా కొట్టుకుని మృత్యువాతపడ్డాయని గారపాటి వీరబ్బాయి, తాటిపర్తి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెంచుకుంటున్న మొత్తం గొర్రెలు మృత్యువాత పడ్డాయన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top