నేల తల్లిని నమ్ముకుని బతుకు బండి లాగిస్తోంది..

నేల తల్లిని నమ్ముకుని బతుకు బండి లాగిస్తోంది..


వేలేరుపాడు : ఈమె పేరు సోడే సాయమ్మ. వయసు ఆరు పదుల పైమాటే. వేలేరుపాడు మండలం జిన్నెలగూడెంకు చెందిన ఆమె పుట్టు మూగ. వివాహం చేసుకోలేదు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. వారసత్వంగా సంక్రమించిన 6 ఎకరాల భూమి ఆమెకు జీవనాధారం. గిరిజన కుటుంబానికి చెందిన ఈమె 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ మహిళా రైతుగా రాణిస్తోంది. ఎవరి ఆసరా లేకుండా.. నేల తల్లిని నమ్ముకుని ఒంటరిగా బతుకు బండి లాగిస్తోంది.

 

ఇదీ నేపథ్యం..

సోడే మల్లయ్య, కన్నమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు మాలక్ష్మి, రెండో కుమార్తె దూపమ్మ కాగా, సాయమ్మ మూడో సంతానం. తల్లిదండ్రులు సాయమ్మ చిన్నప్పుడే మరణించారు. రెండో కుమార్తె దూపమ్మ కూడా చనిపోయింది. తండ్రి మల్లయ్యకు బండలబోరు గ్రామంలో 12 ఎకరాల పట్టా భూమి ఉంది.



ఆ భూమిని సాయమ్మ, ఆమె పెద్దక్క మాలక్ష్మికి 6 ఎకరాల చొప్పున గ్రామ పెద్దలు పంచారు. సాయమ్మ తన వాటాగా వచ్చిన ఆరెకరాల బీడు భూమిని ఒంటరిగానే బాగుచేసుకుంది. బండరాళ్లు, రుప్పలను తొలగించి సేద్యానికి అనుకూలంగా మలుచుకుంది. అందులో వరిసాగు చేస్తోంది. రెండు ఎడ్లను పెంచుతోంది. వాటి సాయంతో అరకు కట్టి దున్నుతోంది. సొంతంగా ఎడ్లబండిని సమకూర్చుకుంది.



నారు పోయడం, నాట్లు వేయడం, కుప్ప నూర్చడం వంటి పనులను అవలీలగా చేస్తోంది. ఈ బీడు భూమిలో ఏ పంట పండాలన్నా సాగునీటి సౌకర్యం లేదు. దీంతో వర్షాధారంగా ఏటా ఒక పంట మాత్రమే సాయమ్మ పండిస్తోంది. నేలపై పశువుల పెంటవేసి, ఎరువులు వాడకుండా ఎకరాకు 15 బస్తాల చొప్పున ఏటా 90 బస్తాలకు తగ్గకుండా ధాన్యం దిగుబడి వస్తోంది. ఏడాదంతా తాను తినడానికి అవసరమైన ధాన్యాన్ని గాదెలో నిల్వ చేసుకుంటోంది. మిగతా ధాన్యాన్ని విక్రయించగా వచ్చే సొమ్ముతో నిత్యావసర సరుకులు, ఇతర అవసరాలకు వినియోగించుకుంటోంది.



వ్యవసాయ పనులు లేనప్పుడు ఖాళీగా ఉండకుండా పత్తి తీత పనులకు వెళుతోంది. ఇలా రోజుకు రూ.100 వరకు సంపాదిస్తోంది. మాటలు రాకపోయినా సైగల ద్వారా విషయాలు చెబుతుంది. ఆమె ఏం చెబుతోందనేది గ్రామంలోని వారందరికీ ఇట్టే అర్థమవుతాయి. సాయమ్మకు వేలేరుపాడులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో అకౌంట్ ఉంది. ఖర్చులు పోగా మిగిలిన సొమ్మును ఆ ఆకౌంట్‌లో దాస్తోంది.



కాయకష్టం చేస్తూ తన అక్క మాలక్ష్మి, బావ బజారుకు సహకరిస్తుంటుంది. మాటలు రాకపోయినా.. మహిళ అయినా సాయమ్మ వ్యవసాయం చేస్తూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె బావ బజారు మాట్లాడుతూ.. ‘మా ఇంట్లో ఉండమన్నా ఉండదండి. ఆమెకు కాలనీలో ఇల్లు వచ్చింది. అందులో ఒంటరిగానే ఉంటోంది. తన వంట తానే వండుకుంటుంది. ఎప్పుడూ ఎవరినీ  నొప్పించదు. పెళ్లి చేద్దామనుకున్నాం. చాలాసార్లు పెళ్లి మాటెత్తితే ఒప్పుకోలేదు. ఒంటరిగానే ఉంటానంది. అందుకే పెళ్లి చేయలేదు’ అని చెప్పాడు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top