శాతవాహన ఎక్స్ ప్రెస్కు తప్పిన ప్రమాదం

శాతవాహన ఎక్స్ ప్రెస్కు తప్పిన ప్రమాదం


- బోగీలు ఊగడంతో భయకంపితులైన ప్రయాణికులు

- చైన్‌లాగి ఆపివేత..10 నిముషాల తర్వాత బయలుదేరిన రైలు




డోర్నకల్(వరంగల్ జిల్లా):  మెయిన్‌లైన్‌లో గూడ్సురైలు ఉండడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను లూప్‌లైన్‌లో వదిలారు. అయితే లూప్‌లైన్ పట్టాలు బలహీనంగా ఉండడంతో రైలు మామూలు పట్టాలపై వెళ్లినట్లు వేగంగా వెళ్లడంతో బోగీలన్నీ ఒక్కసారిగా ఊగిపోయాయి. దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై కేకలు వేస్తూ చైన్ లాగి రైలును ఆపేశారు. ఈ సంఘటన మహబూబాబాద్- డోర్నకల్ మార్గంలో గుండ్రాజుమడుగు రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి జరిగింది. రైలు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ఏదో ప్రమాదం జరుగుతోందని రైలుదిగి పరుగులు తీశారు.



రైల్వే స్టేషన్‌ మాస్టర్ జరిగిన పరిస్థితిని విచారణ చేశారు. లూప్‌లైన్‌లో రైలును వదిలినందువల్ల పరిమితికి మించి వేగంతో రైలు వెళ్లడంతో పట్టాలపై ఒత్తిడి పెరిగి బోగీలు అటూ ఇటూ ఊగాయని, అంతే తప్ప ప్రమాదం జరగలేదని వివరించారు. అయితే రైలు డ్రైవర్ జాగ్రత్తగా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొన్ని నిముషాల పాటు ఆగిన రైలు మళ్లీ బయలుదేరింది. రైలు డోర్నకల్ చేరిన తర్వాత అక్కడ కూడా ప్రయాణికులు దిగి రైలు డ్రైవర్‌పై ఫిర్యాదుచేశారు. రైలును జాగ్రత్తగా నడపేలా డ్రైవర్ కు సూచించాలని రైల్వే అధికారులను కోరారు. ఆమేరకు స్టేషన్‌మాస్టర్ రైలు డ్రైవర్‌కు సూచనలు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top