మహాధర్నా ఉద్రిక్తం

మహాధర్నా ఉద్రిక్తం - Sakshi

 

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నాపై విరుచుకుపడిన పోలీసులు

విద్యార్థినులపై పిడిగుద్దులు, విద్యార్థుల చొక్కాల చించివేత

 

కడుపుమీద కొట్టొద్దంటూ విద్యార్థులు పెట్టిన ఆకలి కేకలను పోలీసు లాఠీల గాండ్రిపులతో అణగదొక్కారు. ఆకాశాన్నంటిన నిత్యావసరాలను అందుకోవాలంటే మెస్, కాస్మెటిక్‌ చార్జీలు పెంచాలని నినదించిన గొంతులను పోలీసు పిడిగుద్దులతో నొక్కి పడేశారు. దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును చొక్కాపట్టి నిలదీసేందుకు రోడ్డుపైకి వచ్చిన వారి చొక్కాలనే చించేశారు. పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది బాబూ అని ధర్నా చేపట్టిన విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా ఈడ్చిపడేశారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విజయవాడలో విద్యార్థులు చేపట్టిన మహాధర్నాను పోలీసులు అత్యుత్సాహం చూపి అడుగడుగునా నిలువరించారు.

 

గాంధీనగర్‌: సంక్షేమ వసతి గృహాలను తిరిగి ప్రారంభించాలని, మెస్, కాస్మెటిక్‌ చార్జీలు పెంచాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా, ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. రాజకీయ పక్షాలు, అంగన్‌వాడీ కార్యకర్తలపై వ్యవహరించిన విధంగా విద్యార్థులపైనా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. హాస్టళ్లను మూసివేసి మమ్మల్ని విద్యకు దూరం చేయొద్దంటూ నినదించిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్‌ చేసి స్టేషన్లకు తరలించారు. దీక్ష చేస్తున్న వారిని శిబిరం నుంచి తరిమివేశారు. శిబిరానికి మైకు, కరెంట్‌ సౌకర్యం కల్పించిన మెకానిక్‌ బాషాపైనా పోలీసులు దౌర్జన్యం చేశారు. నగర ప్రజల సాక్షిగా విద్యార్థుల హాహాకారాలతో అలంకార్‌ సెంటర్‌ ఘోషించింది.  అరెస్ట్‌ల అనంతరం అలంకార్‌ సెంటర్‌లో విద్యార్థుల చెప్పులు, బూట్లు కుప్పలుగా పడిపోయాయి. పోలీసులు, విద్యార్థులకు మధ్య జరిగిన తోపులాటలో కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. సమస్యలు పరిష్కరించండంటూ అందోళన చేస్తున్న తమను రౌడీల్లా ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారని విద్యార్థి సంఘం నాయకులు వాపోయారు. 

వెంటనే హాస్టల్స్‌ ప్రారంభించాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి

అంతకు ముందు జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ రమాదేవి మాట్లాడుతూ హాస్టల్స్‌ మూసివేస్తే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విద్యకు దూరవుతారన్నారు. దళిత మంత్రి రావెల కిషోర్‌బాబు చేత్తోనే చంద్రబాబు దళితుల కళ్లు పొడుస్తున్నారని విమర్శించారు. గురుకులాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, హాస్టల్స్‌ రద్దు చేసి గురుకులాల్లో విలీనం చేస్తామనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. రెండేళ్లలో చంద్రబాబు, రావెల కిషోర్‌బాబు ఎన్ని గురుకులాలు ప్రారంభించారో స్పష్టం చేయాలన్నారు. తక్షణమే హాస్టల్స్‌ మూసివేత నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సానూ మాట్లాడుతూ మెస్‌ చార్జీలు రూ. 750 నుంచి రూ.1500కు పెంచాలని, కాలేజీ విద్యార్థులకు రూ. 2 వేలు ఇవ్వాలని కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మౌలికç Üదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. గురుకులాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 13 డిమాండ్లపై చేపట్టిన ఆందోళనలో వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top