‘సెస్‌’ కొనుగోళ్లపై మంత్రి కేటీఆర్‌ ఆరా


సిరిసిల్ల : సిరిసిల్ల ‘సెస్‌’ పరిధిలో టెండర్లు లేకుండా ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల కొనుగోలు వ్యవహారంపై మంత్రి కేటీఆర్‌ గురువారం ఆరా తీసినట్లు సమాచారం. ఎల్లారెడ్డిపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న  కేటీఆర్‌ ‘సెస్‌’ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, డైరెక్టర్‌ కుంబాల మల్లారెడ్డిని తన వాహనంలో ఎక్కించుకుని కొనుగోళ్ల వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు జరిగాయని చైర్మన్‌ లక్ష్మారెడ్డి వివరణ ఇవ్వగా.. పారదర్శకంగా టెండర్లు నిర్వహించకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలకవర్గం సభ్యుల మధ్య అంతర్గత కలహాలపైనా మంత్రి ఆరా తీసినట్లు తెలిసింది. ప్రధానంగా ‘సాక్షి’ కథనాలను ప్రస్తావిస్తూ.. ‘సెస్‌’ పరిధిలో ఇటీవల నెలకొన్న అంశాలను మంత్రి కేటీఆర్‌ అడిగినట్లు సమాచారం. ఉద్యోగుల సరెండర్, మూకుమ్మడి సిమ్‌కార్డుల సరెండర్‌ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. సమర్థవంతమైన సేవలు అందించే ‘సెస్‌’ పరువుతీయకుండా నిజాయితీగా వినియోగదారులకు సేవలు అందించాలని కేటీఆర్‌ సూచించినట్లు తెలిసింది.

 

అత్యవసరం మేరకే కొనుగోళ్లు 

– ‘సెస్‌’ ఎండీ నాంపల్లి గుట్ట 

 ‘సెస్‌’ పరిధిలో అత్యవసరమైన పనుల కోసం టెండర్లు లేకుండానే కొనుగోళ్లకు పర్చేజ్‌ కమిటీ ఆమోదంతో ఆర్డర్లు ఇచ్చామని మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.నాంపల్లి గుట్ట తెలిపారు. సిరిసిల్ల ‘సెస్‌’ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మధ్యమానేరు పునరావాస కాలనీల్లో విద్యుద్దీకరణ కోసం ప్రభుత్వం కలెక్టర్‌ ద్వారా ‘సెస్‌’ సంస్థకు రూ.4.87 కోట్లు డిపాజిట్‌ చేసిందని వివరించారు. పునరావాస కాలనీల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు అత్యవసరంగా భావించి పాలకవర్గం నిర్ణయం మేరకు కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. టెండర్లు లేకుండా అవసరం మేరకు కొనుగోళ్లు చేయవచ్చని ‘సెస్‌’ నిబంధనల్లో ఉందని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులన్నీ సిద్ధంగా ఉన్నాయని ఎండీ తెలిపారు. ‘సెస్‌’ సంస్థకు నష్టం కలిగించే పనులు చేయడం లేదని పేర్కొన్నారు. పాలకవర్గంలోని కొందరు డైరెక్టర్లు వ్యతిరేకిస్తున్నా.. టెండర్లు లేకుండా కొనుగోళ్లు చేయడంపై ‘సాక్షి’లో ప్రచురితమైన వరస కథనాలపై ఎండీ స్పందించి వివరణ ఇచ్చారు. సమావేశంలో ఏడీఈ రాజిరెడ్డి ఉన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top