ప్రజల నెత్తిన శనగ బాంబు

ప్రజల నెత్తిన  శనగ బాంబు

తాడేపల్లిగూడెం:

ప్రజల నెత్తిన శనగపప్పు ధరల బాంబు పడింది. ఏకంగా కిలో ధర రిటైల్‌ మార్కెట్‌లో 150 రూపాయలకు చేరింది., గత ఏడాది అక్టోబరులో కిలో శనగపప్పు ధర 70 రూపాయలు మాత్రమే ఉంది. పప్పుల ధరలు వినియోగదారులతో దోబూచులాడుతూ ఉన్నాయి. ప్యూచర్‌ ట్రేడింగ్‌ పుణ్యాన సిండికేట్‌గా ఏర్పడిన గుత్త వ్యాపారులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ కేంద్రంగా  అపరాల మార్కెట్‌ను శాసిస్తున్నారు. వారు చెప్పింది ధర అన్నట్టుగా హవా సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 28 వ తేదీన పప్పుల మార్కెట్‌లో 30 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ధరలు తగ్గి ప్రకంపనలు సష్టించాయి. మార్కెట్‌ బద్దలు కావడంతో కొందరు వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. కిలోకు ఏకంగా 20 నుంచి 30 రూపాయలు గుత్త మార్కెట్‌లో ధరలు తగ్గి మార్కెట్‌ పతనమైంది. ఆ ప్రభావం రిటైల్‌మార్కెట్‌లో కనపడలేదు. యధారీతిగా చిన్న వ్యాపారులు వినియోగదారులను దోచుకున్నారు. అపరాల మార్కెట్‌ మరింతపతనమవుతుందని అప్పట్లో వ్యాపార వర్గాలు భావించాయి. దీనికి భిన్నంగా గత 15 రోజులుగా శనగపప్పు ధర ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తుంది. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు శనగపప్పు అవసరాలను తీరుస్తాయి. డిమాండ్‌ మేరకు ఈ పప్పును వ్యాపారులు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటారు. వాతావరణ అననుకూల పరిస్ధితుల నేపధ్యంలో ఈ ఏడాది శనగల దిగుబడులు 50 శాతం పడిపోయాయి. ఇదే ఆసరాగా గుత్త వ్యాపారులు విజంభించారు. క్వింటాలు 1350 రూపాయలు చెల్లిస్తేనే . పప్పు డెలివరీ అంటూ కూర్చున్నారు. వచ్చేది దీపావళి పండుగ, కార్తీక మాసం. పండుగలు రావడంతో పాటుగా వివాహాలు జరుగుతున్నాయి. దీంతో శనగపప్పుకు డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో శనగపప్పు ఆకాశానికి ఎగబాకింది. కిలో గుత్త మార్కెట్‌లో 110 రూపాయలకు చేరింది. అక్కడి నుంచి 115 రూపాయలకు పెరిగింది. అక్కడి నుంచి 120 , అక్కడి నుంచి ఏకంగా 135 రూపాయలకు చేరుకుంది. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో కిలో 150 రూపాయలకు శనగపప్పు అమ్ముతున్నారు. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఏడాది వ్యవ«ధిలో శనగపప్పు ధర ఏకంగా వంద శాతానికి పైగా పెరిగింది. రానున్న రోజుల్లో ఈ పప్పు ధర మరింతపెరిగే సూచనలు కనపడుతున్నాయి. కందిపప్పు విషయానికొస్తే నాగపూర్‌ కందిపప్పు కిలో 130 రూపాయలకు రిటైల్‌ మార్కెట్‌లో ఉంది. గుత్త మార్కెట్‌లో 120 రూపాయలకు విక్రయిస్తున్నారు. సాధారణ రకం కందిపప్పు కిలో గుత్త మార్కెట్‌లో వంద రూపాయలు ఉండగా, విడిగా కిలో 110 రూపాయలకుఅమ్ముతున్నారు. గుంటూరు. మాచర్ల, వినుకొండ ప్రాంతాల నుంచి రకరకాల బ్రాండ్ల పేర్లతో మినపప్పు మార్కెట్‌లోకి వస్తుంది. నాణ్యతలో ఏ మాత్రం తీసిపోని విధంగా ఉండటంతో వినియోగదారులు ఈ పప్పులను కొంటున్నారు. గుత్త మార్కెట్‌లో కిలో 95 రూపాయలుండగా, విడిగా కిలో 100 నుంచి 110 రూపాయలకు అమ్ముతున్నారు. బొబ్బరపప్పు మషాలావడలు వేసుకోమన్నట్టుగా చౌకగా దొరుకుతుంది. గుత్త మార్కెట్‌లో కిలో 70 రూపాయలుండగా, విడిగా 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. మిగిలిన పప్పులు, గోధుమ ఆధారిత ఉత్పత్తుల ధరలు స్దిరంగా ఉన్నాయి. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top