చెల్లెమ్మల చెవిలో రాయితీ పూలు


- వడ్డీ రాయితీపై మహిళల ఆశలు

-ఏడాదిగా విడుదల కాని డబ్బులు

-రెండో విడత ప్రోత్సహమే లేదు




శ్రీకాకుళం: మహిళలకు ఏపీ ప్రభుత్వం వడ్డీ రాయితీ విషయంలో చుక్కలు చూపిస్తోంది. స్వయం శక్తి సంఘాల మహిళలకు రెండేళ్లుగా రాయితీలు విడుదల చేయకపోవడంతో అవి కాస్తా క్షీణిస్తున్నాయి. మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం (లింకేజీలకు), బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్వయానా ముఖ్యమంత్రే హామీ ఇచ్చారు. అంతకు ముందు ప్రభుత్వం సంఘాలు కట్టే వడ్డీలో 75 శాతం చెల్లించేది. మిగిలిన 25 పైసలు సంఘాలు చెల్లించేవి. అయితే చంద్రబాబు పూర్తి వడ్డీ రాయితీ పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి గాను సంఘాలు ప్రతినెల రుణంలో వాయిదా అసలుతో పాటు, వడ్డీని కూడా బ్యాంకులకు చెల్లిస్తున్నాయి. ప్రభుత్వం బ్యాంకుల్లో వడ్డీని జమ చేసిన వెంటనే ఆ వడ్డీని బ్యాంకర్లు సంఘాల ఖాతాలకు తిరిగి జమ చేస్తాయి. అయితే గత ఏడాదిగా ఈ పూర్తి వడ్డీ పథకం అమలు కావడం లేదు. దీంతో మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు.   



గత ఏడాది నుంచి జిల్లాలో సంఘాలకు చెల్లించాల్సిన పూర్తి వడ్డీ రాయితీకి సంబంధించి సుమారుగా *30కోట్లు బకాయిలు ఉన్నాయి. గత ఏడాది (2015) జూన్ నెల నుంచి ఈ వడ్డీ రాయితీ విడుదల కాలేదు, జిల్లాలో 44,327 సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు గాను రూ.728 కోట్ల వరకు రుణ నిల్వ ఉంది. ఈ రుణాలకు గాను సంఘాల సభ్యులు ప్రతి నెల వాయిదాల రూపలంలో అసలు వడ్డీలు రూ.728 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తున్నారు. అయితే ప్రతి నెల ప్రభుత్వం ఈ రుణాలకు గాను రూ.4 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ ఏడాదిగా ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. అంతే కాకుండా మహిళలకు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట మార్చింది. సంఘాలల్లో మహిళలకు ఒకరికి రూ.10 వేలు వంతున ప్రోత్సాహం వేస్తామని చెప్పి, ఒక విడతలో రూ.3వేలు వేసినా మిగిలిన రూ.7వేలుకి ఇంతవరకు అతీగతీ లేదు, ఏడాదిగా మహిళలు ఈ ప్రోత్సాహం కోసం ఎదురుచూస్తున్నారు.  



రాయితీ వస్తుంది..

పూర్తి వడ్డీ రాయితీ విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదు. దశల వారీగా వస్తుంది. గత ఏడాది వచ్చింది రాయితీ సం ఘాల ఖాతాల్లో జమ చేశాం. ఈ ఏడాది పూర్తి వడ్డీ రాయితీ నగదు కూడా దశల వారీగా విడుదల కానుంది. అందుకు కావాల్సిన నివేదికలు ప్రభుత్వానికి అందజే శాం.

-ఎస్.తనూజారాణి, డీఆర్‌డీఏ పీడీ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top