తాత్కాలిక సచివాలయం ప్రారంభం

తాత్కాలిక సచివాలయం ప్రారంభం - Sakshi


తాత్కాలిక సచివాలయంలోని ఒక గదిలోకి సీఎం

తెల్లవారుజామున సభలో మంత్రుల పొగడ్తల హంగామా    

తొలి సంతకం  ఫైలు పైనా హడావుడి






 తాత్కాలిక సచివాలయ శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో స్పీకర్ కోడెల, మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి, రఘునాథ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, చీఫ్ సెక్రటరీ ఎస్.పి.టక్కర్, ఉద్యోగ సంఘ నేత అశోక్‌బాబు తదితరులు  సచివాలయానికి ముందస్తు ప్రారంభోత్సవం

 

 సాక్షి, విజయవాడ బ్యూరో : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తెల్లవారుజామున శాస్త్రోక్తంగా ప్రారంభోత్సవం చేశారు. ఎల్ అండ్ టీ నిర్మిస్తున్న నాలుగో బ్లాకులోని ఒక గదిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల తర్వాత ఆరు నెలల దాకా ముహూర్తాలు లేవనే కారణంతో నిర్మాణం సగంలో ఉండగానే ఈ ముందస్తు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆఘమేఘాల మీద సిద్ధం చేసిన గదిలోకి శాస్త్రోక్తంగా పూజలు జరిపి ముఖ్యమంత్రి ప్రవేశించారు. ఆ గదిలో ఉత్తరాభిముఖంగా ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చుని మంత్రులు, ఉన్నతాధికారులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు శాలువాలు, పూల బొకేలతో అభినందించారు.





 సీఎం ఒక్కరే హాజరు...

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా వస్తారని అందరూ భావించినా ఆయన ఒక్కరే రావడం విశేషం. గృహ ప్రవేశం కార్యక్రమాలను దంపతులు కలిసి నిర్వహించాల్సివుండగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే ఆ పని పూర్తి చేశారు. ప్రారంభోత్సవం తర్వాత జరిగిన సభలో రైతుల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధుల వరకు అందరితోనూ చంద్రబాబు మాట్లాడించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే సభకు అధ్యక్షత వహించగా రాజధానికి భూములిచ్చిన ఇద్దరు రైతులు, స్థానిక ఎంపీపీ పద్మలత, సీఆర్‌డీఏ కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ శ్రీకాంత్, ఎన్జీఓల సంఘం నేత అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మాట్లాడారు.



మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు, పుల్లారావు చంద్రబాబును ఆకాశానికెత్తే రీతిలో పొగడ్తలతో ముంచెత్తేశారు. పల్లె రఘునాథ్‌రెడ్డి ఏకంగా చంద్రబాబును ఇంద్రుడితో పోల్చుతూ అప్పట్లో దేవుడైన ఇంద్రుడు అమరావతిని నిర్మించగా ఇప్పుడు చంద్రబాబు ఈ అమరావతిని నిర్మిస్తున్నాడని ఆకాశానికెత్తేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సైతం చంద్రబాబును పొగడటానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు సభ జరిగింది. తెల్లవారుజామున సభ పెట్టడమే విచిత్రమైతే అందులోనూ మంత్రులు, అధికారుల పొగడ్తలు మరీ శృతిమించడంతో హాజరైన రైతులు విసుగు చెందారు.

 

 

 తొలి ఫైలు.. హైరానా!

 సచివాలయంలో ప్రవేశించిన తర్వాత ముఖ్యమంత్రితో తొలి ఫైలుపై సంతకం చేసే విషయంలో అధికారులు హైరానా పడ్డారు. తొలుత ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్ ఒక ఫైలును తీసుకురాగా దాన్ని చదివిన ముఖ్యమంత్రి సంతకం చేయడానికి నిరాకరించారు. దీంతో ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్, ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి రాజమౌళి రెండో విడత రుణమాఫీ సొమ్ము రూ.3,200 కోట్లు విడుదల చేసే దస్త్రాన్ని అప్పటికప్పుడు స్వదస్తూరితో సిద్ధం చేశారు. అందులోనూ ముఖ్యమంత్రి మళ్లీ మార్పులు చేయడంతో రాజమౌళి మళ్లీ స్వదస్తూరితో మరో కాగితాన్ని సిద్ధం చేసి తీసుకురాగా దానిపై చంద్రబాబు సంతకం చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top