పోలీస్‌ శాఖలో రహస్య బదిలీలు

పోలీస్‌ శాఖలో రహస్య బదిలీలు - Sakshi


– ఎస్పీ బదిలీ నేపథ్యంలో ఆశావహుల క్యూ

– నేతల నుంచి సిఫార్సులు, ఒత్తిళ్లు




అనంతపురం సెంట్రల్‌ : జిల్లా పోలీసుశాఖలో రహస్య బదిలీలు ఊపందుకున్నాయి. ఎస్పీ రాజశేఖర్‌బాబు చిత్తూరు జిల్లాకు బదిలీ అవుతున్న నేపథ్యంలో అనువైన పోస్టుల కోసం కొంతమంది ఉద్యోగులు పైరవీలు సాగిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా లూప్‌లైన్, వేకన్సీ రిజర్వ్‌(వీఆర్‌)లో ఉన్న ఉద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికశాతం కానిస్టేబుళ్లు ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. నేతల నుంచి సిఫార్సులు, అదే శాఖలో ఎస్పీకి సన్నిహితంగా ఉంటున్న కొంతమంది ఉన్నతాధికారులు, యూనియన్‌ నేతల నుంచి ఒత్తిళ్లు చేస్తున్నారు. వందల సంఖ్యలో దరఖాస్తులు ఎస్పీ కార్యాలయానికి చేరినట్లు తెలుస్తోంది. అయితే వీరిలో మెజార్టీ శాతం ఉద్యోగులు గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవారే అని తెలుస్తోంది. అనేక మందిని ఎస్పీనే జిల్లా నలుమూలలకు గతంలో బదిలీ చేశారు. మరికొందరని వీఆర్‌కు పంపారు. దీంతో బదిలీపై వెళ్లే సమయంలో ట్రాన్స్‌ఫర్స్‌ చేయాలా.. వద్దా అనే అంశంపై జిల్లా ఎస్పీ మీమాంశలో ఉన్నారనే అభిప్రాయం ఆశాఖ ఉద్యోగవర్గాలు వెల్లడిస్తున్నాయి.  



దీపం ఉండగానే..

 దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రస్తుత ఎస్పీ హయాంలోనే కీలకమైన పోస్టింగ్‌ దక్కించుకోవాలని కొందరు యత్నాలు సాగిస్తున్నారు. ఇందుకోసం అన్ని మార్గాలను వెతుకుతున్నారు. కొందరు అధికారపార్టీ ముఖ్యనేతల నుంచి సిఫార్సు లేఖలు తీసుకువస్తే.. మరికొందరు అదేశాఖలో ఎస్పీకి సన్నిహిత అధికారుల మద్దతుతో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో కొందరు అమ్యామ్యాలు కూడా ముట్టచెబుతున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ఫర్‌, అటాచ్‌మెంట్స్, పోస్టింగ్‌కు ఒక్కో అంశానికి ఒక్కో రేటు చొప్పున కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యూనియన్‌లో ఓ నేత , ఎస్పీ కార్యాలయంలో ఓ ఉద్యోగి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొందరు రాజకీయపార్టీ నేతలు కూడా ముందుజాగ్రత్త పడుతున్నారు.



వచ్చే ఎస్పీ తమతో ఎలా ఉంటారో తెలియదు. ప్రస్తుత ఎస్పీతోనే పనులు చేయించుకోవాలనే భావనతో అధికారపార్టీ నేతలు సిఫార్సులు పంపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓ ప్రజాప్రతినిధి నేరుగా ఎస్పీ కార్యాలయానికే వచ్చి తమ నియోజకవర్గంలో వీరికి అవకాశం ఇవ్వాలని లేఖ అందించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా, సిఫార్సు లేఖలు ఎస్పీ కార్యాలయానికి పంపిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉద్యోగుల బదిలీలు పూర్తయ్యాయి. ఇంకా వందల్లో ఉండడంతో ఉన్నతాధికారులు బదిలీల ఫైల్‌పై సంతకాలు చేయాలా వద్దా అని తర్జనభర్జన పడుతున్నారు. కాగా ఒత్తిళ్లకు తలొగ్గి బదిలీలు చేపడితే తీవ్ర విమర్శల పాలు కావాల్సి ఉంటుందని పోలీసువర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top