సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు ప్రియం

సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు ప్రియం

 నుంచి టిక్కెట్ల ధర పెంపు

- 30 శాతం పెరగనున్న వ్రత ఆదాయం

- ఈఓ నాగేశ్వరరావు వెల్లడి

అన్నవరం : సత్యదేవుని సన్నిధిలో వ్రత నిర్వహణ భక్తులకు ప్రియం కానుంది. రూ.150, రూ.300, రూ.700 వ్రతాల టిక్కెట్ల ధరలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 15 శాతం నుంచి 33 శాతం వరకూ పెరగనున్నాయి. నిర్వహణ వ్యయం పెరిగినందున వ్రతాల టిక్కెట్ల ధరలు పెంచాలని దేవస్థానం పాలకవర్గం గతంలోనే నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్, కమిషనర్‌ వైవీ అనూరాధ మంగళవారం ఆమోదించారని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు ‘సాక్షి’కి తెలిపారు. విజయవాడలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను మంగళవారం కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు.

పెంపు ఇలా..

రూ.150 వ్రత టిక్కెట్‌ రూ.200కు, రూ.300 టిక్కెట్‌ను రూ.400కు, రూ.700 టిక్కెట్‌ను రూ.800కి పెంచుతున్నారు. అయితే రూ.1,500, ఏసీ మండపంలో నిర్వహించే రూ.2 వేల వ్రత టిక్కెట్ల ధరలను పెంచడం లేదని ఈఓ తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వ్రతాల ద్వారా సుమారు రూ.23.70 కోట్ల ఆదాయం వచ్చింది. వ్రతాల టిక్కెట్ల పెంపు ద్వారా 30 శాతం అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వ్రత విభాగం ద్వారా రూ.27 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అయితే టిక్కెట్ల ధరలను పెంచడంవలన ఈ ఆదాయం రూ.30 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీంతోపాటు వ్రత పురోహితులకు దేవస్థానం చెల్లించే పారితోషికం కూడా పెరగనుంది.

ప్రసాదం బరువు, ధర పెంపు


సత్యదేవుని ప్రసాదం ధరను కూడా పెంచనున్నారు. ప్రస్తుతం వంద గ్రాముల ప్రసాదం రూ.10కి విక్రయిస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్యాకెట్‌ బరువును 125 గ్రాములకు పెంచి రూ.15కి విక్రయించనున్నట్టు ఈఓ తెలిపారు. ప్రసాదం తయారీలో వాడే ముడి సరుకులు గోధుమ, పంచదార, నెయ్యి, యాలకులతోపాటు వంటగ్యాస్‌ ధర కూడా పెరగడంతో తయారీ వ్యయం భారీగా పెరిగిందన్నారు. వాస్తవానికి బరువు 25 గ్రాములు పెంచినందున దాని ప్రకారం ధర రూ.2.50 పెరుగుతుందని, కానీ ప్రసాదం తయారీలో వస్తున్న నష్టాన్ని అధిగమించేందుకు, చిల్లర సమస్య తలెత్తకుండా ఉండేందుకు మరో రూ.2.50 కలిపి రూ.15కి విక్రయించాలని నిర్ణయించినట్టు ఈఓ తెలిపారు. 2016-17లో ప్రసాదం విక్రయాల ద్వారా దేవస్థానానికి రూ.19.61 కోట్ల ఆదాయం రాగా, 2017-18లో రూ.21.50 కోట్లు వస్తుందని అంచనా వేశారు. తాజా పెంపుదల కారణంగా ఈ ఆదాయం రూ.24 కోట్లు ఉండగలదని అంచనా వేస్తున్నారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top