పల్లె కళకళ!

పల్లె కళకళ! - Sakshi


కామారెడ్డి : పల్లె తల్లివంటిదని, పట్నం ప్రియురాలివంటిదని అంటారు. పల్లెల్లో పనులు దొరకని పరిస్థితుల్లో పలువురు పట్టణాలకు వలస వెళ్లడం కనిపిస్తుంది. అయితే పట్టణాల్లో ఏదో ఒక పని దొరికినప్పటికీ అక్కడ బతకడం భారంగా ఉంటోంది. ఇంటి అద్దెతోపాటు పలు ఖర్చులుంటాయి. వచ్చే కూలి డబ్బులనూ ఆ ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. పట్టణాల్లోనూ సరైన పనులు లభించడం లేదు. దీంతో చాలా మంది స్వగ్రామాల్లో నివసించడానికే ఆసక్తి చూపుతున్నారు. పల్లెల్లోనే ఏదో ఒక పని చేసుకుని జీవించాలనుకుంటున్నారు. అందుకే ఎంతగా పట్టణీకరణ జరిగినా పల్లె జనాభా మాత్రం పెద్దగా తగ్గడం లేదు.



జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నో యువర్‌ డిస్ట్రిక్ట్‌ పేరుతో గణాంకాలను విడుదల చేసింది. కామారెడ్డి జిల్లాలో 87.29 శాతం మంది పల్లెల్లోనే జీవిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంటోంది. 12.71 శాతం మంది మాత్రమే పట్టణాల్లో నివసిస్తున్నారు. జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీ మినహా పట్టణాలేవీ లేకపోవడంతో జనాభాలో అత్యధికం గ్రామీణ ప్రాంతంలోనే జీవిస్తోంది. కామారెడ్డి జిల్లాలో 323 పంచాయతీలు ఉండగా.. 478 రెవెన్యూ గ్రామాలు, వందకుపైగా గిరిజన తండాలు ఉన్నాయి. జిల్లా జనాభా 9,72,625 కాగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు 8,49,003 మంది. పట్టణ ప్రాంతాల్లో నివసించేవారు 1,23,622 మంది ఉన్నారు.



వ్యవసాయమే జీవనాధారం

జిల్లాలో అత్యధికులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవించేవారిలో తొంభై శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. జిల్లాలో 1,33,267 మంది రైతులు ఉండగా 2,13,224 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. 1,81,047 హెక్టార్లలో వ్యవసాయ భూములు ఉన్నాయి. వరి ప్రధాన పంట కాగా మక్క, సోయా, పప్పు దినుసులు, చెరుకు, పత్తి పంటలు సాగవుతాయి. జిల్లాలో వ్యవసాయంపైనే ఆధారపడినవారు అత్యధిక మంది ఉన్నా.. సరైన సాగునీటి వసతి లేని కారణంగా ఎక్కువగా వర్షాధారంగా భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో అధికారికంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 82,132 ఉండగా, అనధికారికంగా మరో 8 వేల కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ ప్రాంత రైతులు తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు.



వ్యవసాయం తరువాత బీడీలే...

జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఉపాధి పొందేది బీడీలపైనే. బీడీ పరిశ్రమకు కామారెడ్డి జిల్లా కేంద్రబిందువుగా ఉంది. ఇక్కడ ఎన్నో కంపెనీలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 40 వేలపైచిలుకు బీడీ కార్మికులు ఉన్నారు. ఇందులో 90 శాతం మంది మహిళలే.. 28,715 మంది కార్మికులకు జీవన భృతి అందుతోంది. వివిధ కారణాలతో మరో 12 వేల మంది దాకా జీవనభృతి అందుకోలేకపోతున్నారు. ప్రభుత్వం పల్లెల అభివృద్ధిపై దృష్టి పెట్టి, సరైన ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.   

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top