‘మంజీర’లో ఇసుక జాతర

‘మంజీర’లో ఇసుక జాతర - Sakshi


⇒ ఎస్గీ క్వారీల్లో తవ్వకాలు 


⇒ సాలూర చెక్‌పోస్టు మీదుగా జోరుగా రవాణా

⇒ టీఎస్‌ఎండీసీ చెక్‌పోస్టులో ఆన్‌లైన్‌ నిలిపివేత

⇒ పన్ను వసూళ్లు లేక రూ.కోట్ల ఆదాయానికి గండి  




బోధన్‌:

మంజీర నది తీరంలో మళ్లీ ఇసుక జాతర మొదలైంది. కొంత కాలంగా ఇసుక రవాణా నిలిచిపోయి గ్రామాల్లో నెలకొన్న ప్రశాంతత దీంతో చెదిరి పోయింది. రయ్‌ రయ్‌ మంటు దూసుకెళ్తున్న టిప్పర్ల మోత పల్లెల్లో అలజడి రేపుతోంది. బోధన్‌ మండలంలోని సాలూర గ్రామ శివారులో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో మంజీర నది ప్రవహిస్తోంది. నదికి ఆవలి ఒడ్డున గల మహారాష్ట్ర భూభాగంలోని ఎస్గీ క్వారీల్లో నాలుగు రోజుల క్రితం ఇసుక తవ్వకాలు మొదలయ్యాయి.


రెండ్రోజుల నుంచి సుమారు 70 నుంచి వంద టిప్పర్లు ఇసుక టిప్పర్లు సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా దూసుకెళ్తున్నాయి. వీటి సంఖ్య త్వరలోనే కొన్ని వందలకు పెరిగే అవకాశముంది. అయితే, ఎస్గీ క్వారీకి ఎదురుగా మన భూభాగంలోని మంజీర నది ఒడ్డున బోధన్‌ మండలంలోని హున్సా, మందర్న, ఖాజాపూర్‌ గ్రామ శివారు ప్రాంతాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఇసుక మేటలను మహారాష్ట్ర క్వారీ కాంట్రాక్టర్లు పలుమార్లు తవ్వేశారు.


ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల గ్రామాల మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇసుక తవ్వకాలు ప్రారంభమైన నేపథ్యంలో మన అధికారులు అప్రమత్తంగా లేకపోతే ‘మహా’ కాంట్రాక్టర్లు మళ్లీ మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చే అవకాశం ఉంది.


ప్రైవేట్‌ వే బ్రిడ్జీలే ఆధారం..

ఎస్గీ క్వారీ నుంచి తెలంగాణ ప్రాంతానికి రవాణా అవుతున్న ఇసుక టిప్పర్లను సాలూర చెక్‌పోస్టు అధికారులు తనిఖీ చేసి, పంపించాలి. నిబంధనల ప్రకారం వాహనాల్లో ఇసుక పరిమాణం, వే బిల్లులు సరి చూసుకుని రవాణాకు అనుమతించాలి. ఆర్డీఏ చెక్‌పోస్టులోని వే బ్రిడ్జి చెడిపోవడంతో మరమ్మతులు చేపట్టలేదు. దీంతో సమీపంలో ఉన్న ప్రైవేట్‌ వే బ్రిడ్జిలపై తూకం వేసి, వారు ఇచ్చే రసీదుపై ఆధారపడి చెక్‌పోస్టు అధికారులు అనుమతి ఇవ్వాల్సి వస్తోంది.


నిబంధనల మేరకు టిప్పర్లల్లో 10 టన్నుల మేరకు పరిమితి ఉందని అధికారులంటున్నారు. వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులో ఇసుక టిప్పర్‌కు రూ.500 చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు. అయితే, క్వారీ నిర్వాహకులు, ప్రైవేట్‌ వే బ్రిడ్జి వారు ఇచ్చిన రసీదుల ఆధారంగా పన్నులు తీసుకోవాల్సి వస్తోంది. ఇటీవలే వాణిజ్యపన్నుల శాఖ ఏర్పాటు చేసిన వే బ్రిడ్జి ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయానికి గండి పడే పరిస్థితి నెలకొంది.


ఇక, 2015లో మహారాష్ట్ర క్వారీల కాంట్రాక్టర్లు నకిలి వేబిల్లులు సృష్టించి అక్రమ రవాణాకు పాల్పడి మన సర్కారుకు వచ్చే రూ.కోట్ల ఆదాయానికి గండికొట్టారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఓవర్‌లోడ్, నకిలీ వేబిల్లు జారీ నియంత్రణకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.


ఆన్‌లైన్‌ ఎందుకు నిలిపి వేశారో..?

అంతరాష్ట్ర సరిహద్దులో ప్రభుత్వం గతేడాది రాష్ట్రంలో పలు చోట్ల టీఎస్‌ఎండీసీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ఇసుక రవాణాపై పన్ను విధించింది. ఈ చెక్‌పోస్టుల్లో టన్నుకు రూ.200 చొప్పున పన్ను వసూలు చేయగా రూ.కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ఆయా చెక్‌పోస్టుల్లో ఆన్‌లైన్‌ ప్రక్రియ నిలిచి పోయింది. చెక్‌పోస్టులున్నప్పటికీ పన్ను వసూలు చేయడం లేదు. దీనిపై జిల్లా అధికారులను ప్రశ్నిస్తే పైనుంచి ఎలాంటి ఆదేశాలు గానీ, మార్గదర్శకాలు కానీ రాలేదని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వానికి రూ.కోట్లలో చేరే ఆదాయం రాకుండా పోతోంది.


పాత వంతెనకు ముప్పు..

మంజీరపై సాలూర గ్రామ శివారులో గల పాత వంతెన నిజాం రాజుల కాలంలో నిర్మించారు. ఈ బ్రిడ్జి పరిస్థితి దృష్ట్యా గతంలో ఇసుక వాహనాల రాకపోకలను నిషేధించారు కానీ గతేడాది నుంచి మళ్లీ అనుమతించారు. భారీ వాహనాల రాకపోకలతో కొత్త వంతెన దెబ్బ తినడంతో ప్రస్తుతం మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రస్తు తం ఇసుక రవాణా పాత వంతెన పైనుంచే జరుగుతోంది. ఈ పాత వంతెనను చెక్‌డ్యాంగా మార్చాలని సాలూర గ్రామ రైతులు చాలా కాలంగా కోరుతున్నారు. ఇసుక రవాణాతో ప్రస్తుతం ఆ వంతెనకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top